RCB vs MI: ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం.. ఆర్సీబీ అద్భుత విజయం.. హ్యాట్రిక్‌తో అదరగొట్టిన హర్షల్ పటేల్

ముంబైపై బెంగళూరు ఘనవిజయం.. హ్యాట్రిక్ వికెట్లు తీసిన హర్షల్ పటేల్ (PC: IPL)

RCB vs MI: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం చెందింది. బెంగళూరు నిర్దేశించిన 166 పరుగల లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది.

 • Share this:
  ఐపీఎల్ 2021లో (IPL 2021)  భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆర్సీబీ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), క్వింటన్ డికాక్ (Quinton De Cock) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ మొదటి నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకపడ్డారు. వీరిద్దరు బ్యాటర్లు పవర్ ప్లేలో దాదాపు 10 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. అయితే క్వింటన్ డికాక్ (24) యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో మ్యాచ్‌లో ముంబైకి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43) తన దూకుడును కొనసాగించినా.. అర్దసెంచరీకి చేరువ అవుతున్న సమయంలోనే గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టి దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

  ఓపెనర్లు ఇద్దరూ డగౌట్‌కి చేరిన తర్వాత ముంబై ఇండియన్స్‌లోని ఒక్క బ్యాటర్ కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు,. ఇషాన్ కిషన్ (9), సూర్యకుమార్ యాదవ్ (8), కృనాల్ పాండ్య (5) తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు. దీంతో హార్డ్ హిట్టర్ కిరాన్ పొలార్డ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారం పడింది. వీరిద్దరూ మంచి స్ట్రైక్ రేటుతో ఆడే ఆటగాళ్లే కావడంతో అప్పటి ముంబై పెద్దగా ఆందోళనలో పడలేదు. అయితే పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ వరుస బంతుల్లో పొలార్డ్, పాండ్యాతో పాటు రాహుల్ చాహర్‌ను కూడా అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో ముంబై ఓటమి కన్ఫార్మ్ అయిపోయింది. ఇక 19వ ఓవర్‌లో మిగిన ఒక వికెట్ కూడా తీసిన హర్షల్ పటేల్ బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.  హర్షల్ పటేల్ 4, యజువేంద్ర చాహల్ 3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై జట్టును ఐపీఎల్‌లో ఆల్ అవుట్ చేయడం రాయల్ చాలెంజర్స్‌కు ఇదే మొదటి సారి. అంతే కాకుండా ఒకే సీజన్‌లో రెండు సార్లు ముంబైని ఓడించడం కూడా ఆర్సీబీకి ఇదే తొలిసారి. ఈ విజయంతో కోహ్లీ సేన 12 పాయింట్లతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం ప్లేఆఫ్స్ చేరడానికి మిగిలిన మ్యాచ్‌లు అన్నీ గెలవాల్సి ఉన్నది. డిఫెండింగ్ చాంపియన్ అయిన ముంబై ఇలాంటి పరిస్థితిలో పడుతుందని ఫ్యాన్స్ అనుకోలేదు. అయినా మిగిలిన మ్యాచ్‌లు గెలిచే సత్తా రోహిత్ సేనకు ఉందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
  Published by:John Naveen Kora
  First published: