కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ తీవ్రతరమవుతున్న సమయంలో పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌ను (IPL 2021) వదిలి స్వదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై (Andrew Tye) వ్యక్తిగత కారణాలు అని చెప్పి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే అతడు ఇండియా నుంచి దోహా వెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి పయనమయ్యాడు. మార్గమధ్యంలో దోహాలో ఒక రేడియో చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఐపీఎల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఐపీఎల్ కోసం అంత భారీగా డబ్బులు ఎలా ఖర్చు చేస్తున్నారో అర్దం కావడం లేదని అన్నాడు. దీనిపై ఆస్ట్రేలియాకే చెందిన నాథన్ కౌల్టర్-నైల్ కౌంటర్ ఇచ్చారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న కౌలర్ట్-నైల్ మాట్లాడుతూ ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు వెళ్లిపోవడాన్ని అర్దం చేసుకోగలను కానీ.. ప్రస్తుత సమయంలో బయోబబుల్‌లో ఉండటమే చాలా సేఫ్ అని అన్నారు. ఇలాంటి సమయంలో ఇంటికి సుదీర్ఘంగా ప్రయాణం చేయడం కంటే సురక్షితమైన బయోబబుల్‌లో ఉండటం వల్ల మనకు ఎలాంటి హానీ జరగదని నాథన్ అన్నారు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్, మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఐపీఎల్ బబుల్‌లో ఉండటం చాలా సేఫ్ అని అన్నారు. 'ఐపీఎల్ బయోబబుల్ చాలా సురక్షిత మైనది. కానీ అదే సమయంలో బయట పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఆటగాళ్లు భయపడి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కానీ నా దృష్టిలో ఇక్కడే కొన్నాళ్లు ఉండటం మంచిది' అని పాంటింగ్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఉదయం పూట జట్టు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో అందరికీ అదే చెబుతున్నాను. బయట మీ కుటుంబాలు సురక్షితంగా ఉన్నారో లేదో కనుక్కోండి. వారు క్షేమంగా ఉంటే మరి ఇతర విషయాలపై పెద్దగా ఆలోచించొద్దని చెప్పాను. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఐపీఎల్ వల్ల ప్రజలు కాస్త వినోదాన్ని పొందుతున్నారు అని పాంటింగ్ చెప్పారు.
కాగా, ఐపీఎల్ తొలి విడత ముగిసిన తర్వాత నలుగురు ఆటగాళ్లు బయోబబుల్‌ను వీడి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై, అడమ్ జంపా, జే రిచర్డ్‌సన్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్ తమ ఇంటికి వెళ్లారు. మిగతవా వారందరూ వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడుతున్నామని చెప్పారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ కుటుంబంతో పాటు బంధువులు కరోనా బారిన పడటంతో వారికి సహాయం చేయడానికి బయోబబుల్ వీడి వెళ్లిపోతున్నానని చెప్పాడు. అంతా సజావుగా సాగితే తిరిగి ఐపీఎల్‌కు వస్తానని కూడా అశ్విన్ చెప్పుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2021, Rajasthan Royals