ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌ను అర్దాంతరంగా వాయిదా (Postponed) వేయడంతో విదేశీ ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఆటగాళ్లందరినీ క్షేమంగా ఇంటికి చేరుస్తామని బీసీసీఐ (BCCI) హామీ ఇచ్చినా.. ప్రయాణ ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక బీసీసీఐ తల పట్టుకుంటోంది. ప్రస్తుతం పలు దేశాలకు నేరుగా విమానాలు నడపటం లేదు. మరోవైపు ఉన్న కొద్దిపాటి విమానల్లో కూడా సీట్లు లేక టికెట్లు దొరకడం లేదు. పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల కోసం చార్టెడ్ ఫ్లైట్లు (Charted Flights)ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ఉన్న ఒకరిద్దరు ఆటగాళ్ల కోసం వారి దేశం వరకు విమానం నడపడం అదనపు ఆర్దిక భారంగా భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రిలయన్స్ గ్రూప్ (Reliance Group) బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ రిలయన్స్ గ్రూప్‌దే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్ల కోసం చార్టెడ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నది. అయితే ఒకరిద్దరి కోసం ఫ్లైట్ ఖాళీగా పంపడం ఎందుకని.. ఇతర ఫ్రాంచైజీల్లో ఉన్న ఆటగాళ్లకు లిఫ్ట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి కొన్ని గంటల్లో న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, కరేబియన్ దీవులకు ఫ్లైట్లు పంపుతున్నామని.. ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లు రావొచ్చని రిలయన్స్ సమాచారం అందించింది. ముంబై ఇండియన్స్ జట్టులో ఇంగ్లాండ్ ప్లేయర్లు లేకపోవడంతో అక్కడికి మాత్రం ఫ్లైట్ వేయలేదు. కాగా, ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరూ లండన్ చేరుకొని 10 రోజుల క్వారంటైన్లో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ జట్టులోని ట్రెంట్ బౌల్ట్, అడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, షేన్ బాండ్ కోసం న్యూజీలాండ్‌కు ఫ్లైట్ పంపించనున్నది. కాగా, ఇతరు జట్లలోని కివీస్ ఆటగాళ్లు కూడా వీరితో కలసి ప్రయాణించనున్నట్లు తెలుస్తున్నది. ఇక సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్, మార్కో జన్సేన్, ట్రినిడాడ్‌కు చెందిన కిరాన్ పొలార్డ్ కోసం మరో చార్టెడ్ ఫ్లైట్ సిద్దం చేసింది. దక్షిణాఫ్రికా, కరేబియన్ దీవులకు చెందిన ప్లేయర్లు ఈ ఫ్లైట్‌లో వెళ్లవచ్చని తెలిపింది. దీంతో హైదరాబాద్ జట్టుకు చెందిన జేసన్ హోల్డర్, కేకేఆర్ జట్టులోని సునిల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కగిసో రబాడతో పాటు ఇతర సఫారీ, కరేబియన్ ప్లేయర్లు ఈ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఈ ఫ్లైట్ ముందుగా దక్షిణాఫ్రికా లోని జొహన్నెస్‌బర్గ్ నగరంలోని ఓఆర్ టాంబో ఎయిర్‌పోర్టుకు చేరుతుందని.. అక్కడ సౌతాఫ్రికా ప్లేయర్లను దించేసి.. ఫ్యూయల్ నింపుకొని నేరుగా ట్రినిడాడ్‌కు ప్రయాణం అవుతుందని రిలయన్స్ గ్రూప్ చెబుతున్నది. ఇంకా ఇతర జట్లకు చెందిన వాళ్లు రావాలనుకుంటే ఫ్రాంచైజీల ద్వారా సమాచారం అందించాలని కోరింది.
ఇక కమర్షియల్ ఫ్లైట్లతో పాటు ఇండియా నుంచి వచ్చే ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్లను కూడా మే 15 వరకు అనుమతించమని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అక్కడకు ఎలాంటి ప్రత్యేక విమానాలు వేయడం లేదు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లను అందరినీ ఒక చోట చేర్చి క్వారంటైన్లో ఉంచడమో లేదంటే మాల్దీవులు లేదా శ్రీలంకకు తరలించడమో చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. అందరూ ఆటగాళ్ల ప్రయాణానికి ఇబ్బందులు తొలగిపోయినా.. ఒక్క ఆసీస్ ఆటగాళ్ల ప్రయాణాలకే సందిగ్దత ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Flight, IPL 2021, Mumbai Indians, Reliance Industries