నేటి తరం యువతకు ఏదైనా త్వరగా జరిగిపోవాలి. ఎక్కువ సేపు ఎవరూ ఒక విషయంపై టైమ్ వేస్ట్ చేసుకోరు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021లో (IPL 2021) ఫలితం మూడు గంటల్లో తెలిసిపోతున్నది. ఆ మూడు గంటల్లోనే క్రికెట్ (Cricket) అభిమానులకు కావల్సినంత వినోదాన్ని అందిస్తూనే మ్యాచ్ కూడా ముగిస్తున్నారు. కానీ ఒకప్పుడు క్రికెట్ ఇలా లేదు. ఆరు రోజుల పాటు సుదీర్ఘంగా టెస్టు మ్యాచ్‌లు జరిగేవి. ఆ ఆరు రోజుల్లో ఒక రోజు విశ్రాంతి దినంగా ఉండేది. దశాబ్దాల పాటు టెస్ట్ క్రికెట్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేది. క్లబ్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఇదొక్కటే ఫార్మాట్. ఆ తర్వాత 1970 ప్రాంతంలో తొలి సారి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా యాషెస్‌లో భాగంగా వన్డే మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించారు. కానీ అవి కమర్షియల్‌గా అంతగా ప్రాచుర్యం పొందలేదు. అప్పుడే రంగంలోకి దిగాడు ఒక బిజినెస్ టైకూన్. ఆస్ట్రేలియాకు చెందిన మీడియా మొఘల్ కెర్రీ ప్యాకర్ వన్డే క్రికెట్లో ఉండే మజా ఏమిటో గ్రహించాడు. వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లతో రహస్య ఒప్పందాలను కుదుర్చుకోవడం మొదలు పెట్టాడు.
కెర్రీ ప్యాకర్ ప్రారంభించాలనుకున్న రెబెల్ క్రికెట్‌కు అప్పటి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ టోనీ గ్రెగ్ చాలా సహాయం చేశాడు. క్రికెటర్లందరినీ కూడగట్టడంతో టోనీ గ్రెగ్ సఫలమయ్యాడు. ఇలా నైన్ నెట్వర్క్ అధినేత కెర్రీ ప్యాకర్ 'వరల్డ్ సిరీస్ క్రికెట్' అనే రెబెల్ వన్డే క్రికెట్ ప్రారంభించాడు. అయితే ప్యాకర్ అసలు ఆలోచన క్రికెట్‌ను రక్షించడమో.. లేదా ఒక కొత్త ఫార్మాట్‌ను ప్రారంభించడమో అసలే కాదు. కేవలం క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి బ్రాడ్కాస్ట్ హక్కులు పొందడం. అయితే అనూహ్యంగా వరల్డ్ సిరీస్ క్రికెట్ అత్యంత ఆదరణ పొందింది. దీన్లోని మజాను చూసిన ప్రజలు మ్యాచ్‌లు చూడటానికి ఎగబడ్డారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ ఆ రెబెల్ క్రికెట్‌ను మూయించాయి. అంతే కాకుండా ఇకపై ప్రతీ దేశం వన్డే క్రికెట్ ఆడేలా టూర్ ప్రోగ్రామ్స్ రూపొందించాయి.
ఇప్పటి తరానికి వన్డే క్రికెట్ అంటే కూడా బోర్ కొట్టేసింది. అప్పుడే న్యూజీలాండ్ టెస్ట్ బ్యాట్స్మాన్ మార్టిన్ క్రోవ్ తక్కువ నిడివి గల క్రికెట్ ఫార్మాట్ రూపొందించాడు. క్రికెట్ మ్యాక్స్ పేరుతో రూపొందించిన ఈ ఫార్మాట్ న్యూజీలాండ్‌లో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ టీ20 ఫార్మాట్‌కు 2003లో రూల్స్ రూపొందించింది. 2007లో టీ20 వరల్డ్ కప్‌తో ఈ ఫార్మాట్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఈ ఫార్మాట్లో లాభాలను ఊహించిన జీ నెట్వర్క్ అధినేత సుభాష్ చంద్ర మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్‌తో కలసి ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ను రూపొందించాడు. ఇండియాలోని అనేక మంది యువ క్రికెటర్లతో ఫ్రాంచైజీలను నెలకొల్పి ప్రారంభించిన ఐసీఎల్ చాలా ఆదరణ పొందింది. ఐసీఎల్ ఎదిగితే బీసీసీఐకి పోటీగా మారుతుందని గ్రహించి బోర్డు.. ఆ ఫ్రాంచైజీల్లో ఆడే రంజీ క్రీడాకారులను నిషేధించింది. అంతే కాకుండా ఇప్పుడు అత్యంత పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రారంభించింది. ఇలా క్రికెట్ అత్యంత ఆదరణ పొందిన ప్రతీ మైలురాయి రెబెల్స్ వల్లే రూపొందింది. అయితే చివరకు అది ఐసీసీ, బీసీసీఐ వంటి అధికారిక సంస్థల చేతుల్లోకే వెళ్లిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.