హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: ఐపీఎల్‌లో 10 ఏళ్ల రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా.. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే

IPL 2021: ఐపీఎల్‌లో 10 ఏళ్ల రికార్డును సమం చేసిన రవీంద్ర జడేజా.. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగుల వీరులు వీరే

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీళ్లే [PC: iplt20.com]

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీళ్లే [PC: iplt20.com]

ఐపీఎల్ 2021లో సిక్సర్ల మోత మోగుతూనే ఉంది. ప్రతీ రోజు ఒక కొత్త రికార్డో చెత్త రికార్డో నమోదవుతూనే ఉన్నది. అలాగే కొన్నేళ్లుగా బద్దలు కాని రికార్డుల కూడా మరోసారి రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అనుకోకుండా ఒక రికార్డును సృష్టించాడు. 19 ఓవర్లకు 154/4గా ఉన్న స్కోర్‌ను 20 ఓవర్‌కు 191/4కి తీసుకెళ్లాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. మధ్యలో ఒక నోబాల్ వేయడంతో ఆ ఓవర్‌లో 37 పరుగులు రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. జడేజా వరుసగా 6, 6, 6(నోబాల్), 6, 2, 4 బాదాడు. జడేజా సిక్సుల మీద సిక్సులు కొడుతుంటే మరో ఎండ్‌లో ఉన్న ధోనీ అతడిని చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి జడేజా 28 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా ఓకే ఓవర్‌లో 36 రన్స్ చేసి పదేళ్ల క్రితం క్రిస్ గేల్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు.

2011లో ఆర్సీబీ తరపున ఆడిన క్రిస్ గేల్.. కోచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన మ్యాచ్‌లో పరమేశ్వరన్ బౌలింగ్‌లో 36 పరుగులు చేశాడు. గేల్ 6, 6(నోబాల్), 4, 4, 6, 6, 4 బాది 36 పరుగులు చేశాడు. ఆ ఓవర్లో కూడా 37 పరుగులు రావడం విశేషం. వీరిద్దరి తర్వాత ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సురేష్ రైనా పేరు మీద ఉన్నది. 2014లో గుజరాత్ లయన్స్ తరపున ఆడిన సురేష్ రైనా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) పైన 32 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో పాట్ కమిన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదాడు. ఐపీఎల్ చరిత్రంలో ఓకే ఓవర్‌లో 30+ పరుగులు చేసిన బ్యాట్స్‌మాన్ మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. గత సీజన్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ రాహుల్ తెవాతియా ఒక్కడే. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మొత్తానికి టీ20ల్లో చూసుకుంటే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా స్కాట్ స్టైరిస్ నిలిచాడు. అతడు 2012లో కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ తరపున ఆడుతూ ఒకే ఓవర్లో 38 పరుగులు చేశాడు. ఒక వోవర్‌లో వరుసగా 6(నోబాల్), 6(నోబాల్), 6, 6, 4, 0, 4, 6 బాది రికార్డు సృష్టించాడు.


ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 30+ పరుగులు చేసిన క్రికెటర్లు వీళ్లే

1. క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) - 36 - కోచి టస్కర్స్ కేరళ - 8 మే 2011

2. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) - 36 - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 25 ఏప్రిల్ 2021

3. సురేష్ రైనా (గుజరాత్ లయన్స్) - 32 - పంజాబ్ కింగ్స్ - 30 మే 2014

4. విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) - 30 - గుజరాత్ లయన్స్ - 14 మే 2016

5. పాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - 30 - చెన్నై సూపర్ కింగ్స్ - 21 ఏప్రిల్ 2021

6. క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) - 30 - పూణే వారియర్స్ ఇండియా - 17 ఏప్రిల్ 2012

7. వీరేంద్ర సెహ్వాగ్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) - 30 - డెక్కన్ చార్జర్స్ - 22 ఏప్రిల్ 2008

8. రాహుల్ తెవాతియా (రాజస్థాన్ రాయల్స్) - 30 - పంజాబ్ కింగ్స్ - 27 సెప్టెంబర్ 2020

9. షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) - 30 - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - 17 మే 2011

First published:

Tags: Chennai Super Kings, Cricket, IPL 2021, Ravindra Jadeja, Royal Challengers Bangalore

ఉత్తమ కథలు