news18-telugu
Updated: May 14, 2019, 7:02 PM IST
రవిశాస్త్రి (ఫైల్ చిత్రం)
క్రికెట్లో రోజు రోజుకీ పోటీ పెరుగుతోందని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో క్రికెట్ కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ జట్ల మధ్య పోటీ బాగా పెరిగిందని రవిశాస్త్రి పేర్కొన్నారు. ముఖ్యంగా 2015 ప్రపంచకప్ తో పోల్చి చూస్తే, క్రికెట్ ప్రస్తుతం చాలా మారిపోయిందని, 2015లో రెండు మూడు జట్లు మాత్రమే ప్రపంచ కప్ గెలుచుకునే సత్తా ఉన్న జట్లుగా కనిపించాయని, ప్రస్తుతం మాత్రం తమదైన రోజు ఎలాంటి జట్టునైనా మట్టి కరిపించగల సత్తా కలిగిన జట్లు బరిలోకి దిగుతున్నాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ సారి వరల్డ్ కప్ భారత్ ముందు సవాలుగా నిలుస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉందని, ఆ జట్టుకి సంబంధంచిన కీలక ఆటగాళ్లు తిరిగి వచ్చారని ఈ నేపథ్యంలో వారిని తక్కువ అంచనా వేసేందుకు సిద్ధంగా లేమని అన్నారు. అలాగే గడిచిన పాతికేళ్లలో ఏకంగా 4 సార్లు ప్రపంచకప్ ఎగరేసుకెళ్లిన జట్టుగా ఆస్ట్రేలియాకు అనుభవం ఉందని, అలాగే 2015 ప్రపంచకప్ జట్టులో ఆడిన సభ్యుల్లో చాలా మంది ఈ ప్రపంచ కప్ లో సైతం ఆడుతున్నారని గుర్తు చేశారు. అలాగే ఇంగ్లాండ్లో ఆటతీరుతో పాటు వాతావరణం ఎదుర్కోవడం కూడా ఆటగాళ్ల ప్రదర్శనలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే ప్రపంచ కప్ కోసం ప్రత్యేకతరహా పిచ్ లు తయారు చేస్తారని, అవి రెగ్యులర్ గా జరిగే కౌంటీ మ్యాచ్ తరహా పిచ్ లు కావని రవిశాస్త్రి అన్నారు.
అలాగే లీగ్ తొలిదశ నుంచే వరుస విజయాలు సాధించాల్సి ఉంటుందని, అప్పుడే పాజిటివ్ గా ముందుకు వెళ్లే వీలుకలుగుతుందని అన్నారు. టీమిండియా ప్రదర్శన విషయానికి వస్తే కేఎల్ రాహుల్, పాండ్యా తిరిగి జట్టులోకి రావడం శుభపరిణామమని అన్నారు. అలాగే వారిద్దరూ తమ తప్పులను సరిదిద్దుకుని మరింత శక్తివంతమైన ప్రదర్శనతో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే టీమిండియాలో ఒక్కో ఆటగాడిది, ఒక్కో ప్రత్యేక శైలి అన్నారు. విరాట్ దూకుడు, ధోనీ ప్రశాంతత, అలాగే రోహిత్, ధావన్ ఇలా ఒక్కో ఆటగాడిలో ఒక్కో వైవిధ్యం ఉందని అన్నారు. దీంతో పాటు జట్టులోని 15 మంది ఆటగాళ్లలో ప్రతీ ఒక్కరూ అత్యంత ఆవశ్యకమని, ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా శైలి కలిగి ఉన్నవారని రవిశాస్త్రి అన్నారు. అలాగే కెప్టెన్, కోచ్ మధ్య సమన్వయం సరిగ్గా ఉంటేనే జట్టు ప్రదర్శన స్థిరంగా ఉండే అవకాశం కలుగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. దీంతో పాటు టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, అలాగే తొలి దశలో పాజిటివ్ స్టార్ట్ లభిస్తే అది టోర్నీ చివరి వరకూ కొనసాగించేందుకు దోహదపడుతుందని రవి శాస్త్రి అన్నారు.
Published by:
Krishna Adithya
First published:
May 14, 2019, 7:02 PM IST