RASHID KHAN STEPS DOWN AS CAPTAIN PROTESTING AGAINST AFGHANISTAN T20 WORLD CUP SQUAD ANNOUNCED BY ACB JNK
Rashid Kahn: అఫ్గాన్ క్రికెట్ బోర్డుపై రషీద్ ఖాన్ ఆగ్రహం.. సంచలన నిర్ణయం తీసుకున్న మిస్టరీ స్పిన్నర్
సంచలన నిర్ణయం తీసుకున్న అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ (PC: AFP)
Rashid Khan: అఫ్గానిస్తాన్ క్రికెటర్, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కీలకమైన టీ20 వరల్డ్ కప్ ముందు జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
యూఏఈ, ఓమన్ వేదికలుగా మరో నాలుగు వారాల్లో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ 10లోగా 15 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది వివరాలను ఐసీసీ పంపాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ఏసీబీ) 18 మందితో కూడిన జట్టను ప్రకటించింది. వీరితో పాటు ఇద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా కూడా చేర్చింది. ఇదే విషయాన్ని ఏసీబీ మీడియా తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. రషీద్ ఖాన్ కెప్టెన్‌గా ఏసీబీ మీడియా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చేసిన 22 నిమిషాల్లోనే రషీద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ఆటగాళ్లను ఎంపిక చేసిందని.. సెలెక్షన్ కమిటీ, ఏసీబీ నా అనుమతి లేకుండానే జట్టును ప్రకటించిందని.. అందుకే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నాడు. తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు.
ఈ ఏడాది జులైలో ఏసీబీ చీఫ్ సెలెక్టర్ అసదుల్లా ఖాన్ రాజీనామా చేశారు. బోర్డులో చాలా అవకతవకలు జరుగుతున్నాయని.. క్రికెటేతరుల జోక్యం చాలా ఎక్కువైందని.. కనీసం క్రికెట్ అంటే కూడా అవగాహన లేని వ్యక్తులు, ఎంపిక ఎలా చేస్తారో తెలియని వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంటూ ఆయన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచే అఫ్గాన్ జట్టు ఎంపిక సరిగా జరగడం లేదని రషీద్ ఖాన్ కూడా అంటున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చాలా మంది గతంలో జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లే. కానీ వీళ్లెవరూ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్‌గా కొనసాగడం లేదు. ఏసీబీ ప్రకటించిన జట్టులో మహ్మద్ షహజాద్ కూడా ఉన్నాడు. 2019 ఆఖర్లో అతడిపై ఏడాది నిషేధాన్ని ఐసీసీ విధించింది. 2020 అగస్టు చివరిలో అతడి సస్పెన్షన్ పూర్తయ్యింది. కానీ అప్పటి నుంచి జట్టులో అతడు లేనే లేడు. ఇక పేసర్లు షాపూర్ జర్దాన్, దౌలత్ జర్దాన్లను కూడా ఎంపిక చేశారు. షాపూర్ 2020 మార్చిలో చివరి సారిగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక దౌలత్ 2019 సెప్టెంబర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. గాయంతో బాధపడుతున్న హమీద్ హసన్ 2016 మార్చి నుంచి టీ20 మ్యాచ్ ఆడలేదు. అతడిని కూడా జట్టులో చేర్చారు.
ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్‌కు వెళ్లే జట్టులో ఫామ్‌లో ఉన్న, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిని ఎంపిక చేయకుండా.. గత రెండు మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న వారిని చేర్చడంపై రషీద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం.. 15 మంది క్రికెటర్లతో పాటు.. రిజర్వ్ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐసీసీ నిబంధనలు మార్చింది. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని 23 నుంచి 30 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ప్రకటించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఏసీబీ కేవలం 18 మంది ఆటగాళ్లను మాత్రమే ప్రకటించింది. దీనిపై కూడా రషీద్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.
'ఒక కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన పౌరుడిగా తన జట్టు ఎంపికలో భాగస్వామ్యం అయ్యే హక్కు ఉంటుంది. అయితే సెలెక్షన్ కమిటీ, అఫ్గాన్ క్రికెట్ బోర్డు తన అంగీకారం లేకుండానే జట్టును ప్రకటించింది. నేను అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఈ నిర్ణయం వెంటనే అమలులోనికి వస్తుంది. అఫ్గానిస్తాన్‌కు ఆడటం నాకు ఎప్పుడూ గర్వకారణమే' అని రషీద్ ట్వీట్లో పేర్కొన్నారు. రషీద్ ఖాన్ తప్పుకోవడంతో సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.