హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఉన్న అరుదైన రికార్డు ఏంటో తెలుసా? స్వాతంత్రానికి ముందే భారత్ పేరిట రికార్డు

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఉన్న అరుదైన రికార్డు ఏంటో తెలుసా? స్వాతంత్రానికి ముందే భారత్ పేరిట రికార్డు

 Olympics

Olympics

ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించబట్టి ఇప్పటికి 120 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు సాధించిన పతకాలు తక్కువే అయినా.. అందులో కొన్ని రికార్డులు ఉన్నాయి.

ఒలింపిక్స్‌లో (Olympics) భారత అథ్లెట్ల(Indian Athletes) ప్రస్థానం మొదలై ఇప్పటికి 120 ఏళ్లు గడిచాయి. ఆధునిక ఒలింపిక్స్ తొలి సారి 1896లో ఏథెన్స్‌లో ప్రారంభమయ్యాయి. కానీ అప్పుడు భారత్ నుంచి ఒక్కరు కూడా ప్రాతినిథ్యం వహించలేదు. 1900లో ఫ్రాన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తొలి సారి భారత్ నుంచి ప్రాతినిథ్యం లభించింది. అప్పట్లో భారత్‌కు స్వతంత్రం రాలేదు. దీంతో బ్రిటిష్-ఇండియా పేరుతో అథ్లెట్లు క్రీడల్లో పాల్గొనేవాళ్లు. 1900 ఫ్రాన్స్ ఒలింపిక్స్‌లో నార్మన్ గిల్బర్ట్ ప్రిచర్డ్ అనే అథ్లెట్ భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అంతే కాకుండా పురుషుల 200 మీటర్ల పరుగులో రజత పతకం గెలిచాడు. అంతే కాకుండా పురుషుల 200 మీటర్ల హార్డిల్స్‌లో కూడా రజతం గెలిచాడు. ఇండియా తరపునే కాకుండా.. ఆసియా తరపున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఆసియా తరపున మొట్టమొదటి సారి భారత అథ్లెట్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 20 ఏళ్లకు బెల్జియం ఒలింపిక్స్, 1924 పారీస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందం ఎలాంటి పతకాలు గెలవకుండానే ఇంటికి తిరిగి వచ్చింది.

పారీస్ ఒలింపిక్స్ తర్వాత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పడింది. దీంతో 1928 ఒలింపిక్స్‌కు ఇండియా నుంచి ఏడుగురు అథ్లెట్లతో పాటు హాకీ జట్టును కూడా పంపారు. ఆ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఏకంగా స్వర్ణ పతకం సాధించింది. పాల్గొన్న తొలి క్రీడల్లోనే స్వర్ణ పతకం సాధించిన జట్టుగా భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. అంతే కాకుండా 1926 నుంచి 1956 వరకు వరుసగా ఆరు సార్లు స్వర్ణ పతకం సాధించి ఒలింపిక్స్ హాకీ ఈవెంట్‌లో భారత జట్టు ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టక పోవడం విశేషం. 1960 రోమ్‌లో హాకీ జట్టు రాణించలేక పోయినా 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం కొట్టింది. ఆ తర్వాత జరిగిన రెండు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పతకమే సాధించని హాకీ జట్టు.. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించింది. భారత జట్టుకు హాకీలో అదే చివరి పతకం కావడం గమనార్హం.

మాస్కోలో హాకీ జట్టు పతకం సాధించిన తర్వాత ఇండియాకు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. ఎన్ని సార్లు ఒలింపిక్స్‌కు వెళ్లినా అందరూ ఖాళీ చేతులతోనే ఇంటి దారి పట్టారు. అయితే 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండప్ పేస్ కాంస్య పతకం సాధించాడు. 16 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కాంస్య పతకం రావడమే కాదు.. 44 ఏళ్ల తర్వాత వ్యక్తిగత పతకం సాధించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 1952లో డీకే జాదవ్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో వ్యక్తిగత కాంస్య సాధించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది.

2004లో ఎవరూ ఊహించని విధంగా రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ డబుల్ ట్రాప్ షూటింగ్‌లో రజత పతకం సాధించాడు. ఆ ఏడాది 74 మంది అథ్లెట్లు వెళ్లగా.. కేవలం ఓకే రజతంతో తిరిగి వచ్చారు. అయితే భారత ఒలింపిక్ చరిత్రలో వ్యక్తిగత రజతం గెలిచిన తొలి అథ్లెట్‌గా రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ రికార్డులకు ఎక్కాడు. ఇక 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో ఏకంగా స్వర్ణ పతకం సాధించాడు. భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఏకైన అథ్లెట్‌గా ఇప్పటికీ బింద్రా రికార్డు చెక్కు చెదరలేదు. అదే ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్యం సాధించి రెజ్లింగ్‌లో పతకం గెలిచిన రెండో రెజ్లర్‌గా రికార్డులకు ఎక్కాడు. బాక్సర్ విజేందర్ సైతం కాంస్యం సాధించడం విశేషం.

2012 లండన్ ఒలింపిక్స్‌లో 83 మంది అథ్లెట్లు భారత్ తరపున వెళ్లగా మొత్తం ఆరు పతకాలు తమ ఖాతాలో వేసుకున్నది. షూటింగ్‌లో విజయ్ కుమార్ ర్యాపిడ్ ఫైర్ 25 మీటర్ల విభాగంలో రజతం సాధించగా.. గగన్ నారంగ్ ఎయిర్ రైఫిల్ 10 మీటర్ల విభాగంలో కాంస్యం సాధించాడు. రెజ్లర్ సుశీల్ కుమార్ రజత పతకం, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, ఫ్లై వెయిట్ విభాగంలో మేరీ కోమ్, ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు కొల్లగొట్టారు. 2016లో 117 మంది రెజ్లర్లను పంపగా కేవలం రెండే పతకాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, మహిళల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యం నెగ్గింది. ప్రస్తుతం టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్స్‌కు 127 మంది అథ్లెట్లు వెళ్లారు. గత 120 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో అత్యధిక అథ్లెట్లు వెళ్లిన విశ్వక్రీడలు ఇవే. మరి ఇక్కడ ఎన్ని పతకాలు కొల్ల గొడతారో వేచి చూడాలి.

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు