Ranji trophy 2022: ప్రస్తుతం జరుగుతోన్న రంజీ టోర్నమెంట్ టో తమిళనాడు (Tamil nadu) స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ వపర్ హిట్టర్ షారుఖ్ ఖాన్ చెలరేగిపోయాడు. టి20 తరహా షాట్లతో ఐపీఎల్ (IPL) ను నెల రోజులు ముందుగానే ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. గ్రూప్ హెచ్ లో భాగంగా ఢిల్లీ (Delhi)తో జరుగుతోన్న రంజీ మ్యాచ్ లో తమిళనాడు స్టార్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీ కు తరలించి పండగ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు 148 బంతుల్లోనే 194 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. షారుఖ్ దెబ్బకు ఢిల్లీ బౌలర్లలో ఏకంగా నలుగురు 5కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. అయితే షారుఖ్ ను దురదృష్టం వెంటాడింది. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన అతడు దానికి కేవలం 6 పరుగుల దూరంలో అవుటై నిరాశ పరిచాడు. షారుఖ్ ఖాన్ గతేడాది జరిగిన ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరఫున పాల్గొన్నాడు. సీజన్ ముగిసిన అనంతరం అతడిని పంజాబ్ వేలంలోకి విడుదల చేసింది. అయితే అనంతరం జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీల్లో రాణించడంతో మెగా వేలంలో అతడిని దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దాంతో పంజాబ్ కింగ్స్ అక్షరాలా రూ. 9 కోట్లను చెల్లించి సొంతం చేసుకుంది. షారుఖ్ తాజా ప్రదర్శన ఆ జట్టు కో ఓనర్ ప్రీతి జింతా మొహంలో తప్పకుండా చిరునవ్వుకు కారణమయ్యయే ఉంటుంది.
మరో తమిళనాడు బ్యాటర్ బాబా ఇంద్రజిత్ (117; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగడంతో తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్ లో 494 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో వికాస్ మిశ్రా 6 వికెట్లు తీశాడు. అంతకుముందు ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్ లో 452 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ ద్వారా రంజీల్లో అరంగేట్రం చేసిన ఢిల్లీ ఓపెనర్, అండర్ 19 ప్రపంచ కప్ సారథి యశ్ ధుల్ సెంచరీతో చెలరేగాడు. 18 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. దాంతో యశ్ ధుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) సరసన నిలిచాడు. సచిన్ కూడా 1988లో తన రంజీ అరంగేట్ర మ్యాచ్ లో శతకం బాదాడు. అప్పుడు సచిన్ వయసు కేవలం 15 ఏళ్లే కావడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడు రోజు ఆట ముగియగా... ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. దాంతో మ్యాచ్ డ్రా గా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, IPL, Punjab kings, Sachin Tendulkar, Tamil nadu