IPL 2021 : రాజస్థాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్.. ఏ జట్టు బలమెంత? గెలుపెవరిది?

మ్యాచ్ నెంబర్ 4 : వాంఖడే వేదికగా రాజస్థాన్, పంజాబ్ నేడు తలపడనున్నాయి. [PC: ipl@twitter]

 • Share this:
  ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్ తొలి సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేదు. పాయింట్ పట్టికలో ఎప్పుడూ చివరి నాలుగు స్థానాల్లో ఉండే రాయల్స్.. గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో యాజమాన్యం అతడిని ఈ సీజన్‌లో విడుదల చేసి.. యువ క్రికెటర్ సంజూ (Sanju Samson)శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కానీ జట్టుకు అవసరమైన సమయంలో వాళ్లు విఫలమవడం భారంగా మారింది. జాస్ బట్లర్, బెన్‌స్టోక్స్ జోడి రాయల్స్‌కు ఓపెనర్లుగా బరిలోకి దిగితే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌లో రావడం జట్టుకు కలసి వస్తుంది. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ తెవాతియా మంచి ఛాయిస్. జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. గత ఏడాది 20 వికెట్లు తీయడే కాకుండా 113 పరుగులు కూడా చేశాడు. అయితే క్రిస్ మోరీస్ ఈ సారి కొత్తగా జట్టుతో చేరాడు. ఆర్చర్ లేని లోటును అతడు తీర్చగలడని యాజమాన్యం భావిస్తున్నది. రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, శివమ్ దూబే‌లు రాణించాల్సిన అవసరం ఉన్నది.

  పంజాబ్ కింగ్స్ పేరుతో సరికొత్తగా అడుగుపెడుతున్న ఈ జట్టుకు కేఎల్ రాహుల్ నడిపిస్తున్నాడు. గత సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే దూకుడు ప్రదర్శించి సీజన్ సగం అయ్యే సరికి పాయింట్స్ టేబుల్‌లో మంచి స్థానంలో ఉన్నది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌తో జట్టును నడిపించారు. కానీ క్రమంగా మ్యాచ్‌లు ఓడుతూ ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకున్నది. స్టార్ బ్యాట్స్‌మాన్ క్రిస్ గేల్‌ను సగం మ్యాచ్‌లు ఆడించకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివర్లో మ్యాచ్‌లు ఓడిపోయి చివరకు ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి కూడా రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తోడు మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికొలస్ పూరన్ దూకుడుగా ఆడగలరు. ఈ సారి జట్టుతో కొత్తగా చేరిన షారుక్ ఖాన్, ఫాబియన్ అలెన్ జట్టుకు కొత్త ఊపు తేగలరని భావిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, క్రిస్ జోర్డాన్, జే రిచర్డ్‌సన్‌కు తోడు రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ వంటి ఛాయిస్‌లు ఉన్నాయి.

  తుది జట్ల అంచనా..

  రాజస్థాన్ రాయల్స్ : బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టన్/యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జాస్ బట్లర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, శ్రేయస్ గోపాల్, ఆండ్రూ టై/జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి

  పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, క్రిస్ గేల్/డేవిడ్ మలన్, నికొలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్/దీపక్ హుడా, మన్‌దీప్ సింగ్/షారుక్ ఖాన్, క్రిస్ జోర్డాన్/ఫాబియన్ అలెన్, జే రిచర్డ్‌సన్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి
  Published by:John Naveen Kora
  First published: