Home /News /sports /

RAHUL DRAVID MARK MAKING VENKATESH IYER A BEST FINISHER AND HARSHAL PATEL AS MIDDLE OVER SPECIALIST JNK

Rahul Dravid: అప్పుడే రాహుల్ మార్క్.. రెండు మ్యాచ్‌లలో స్పష్టంగా కనపడిన వ్యూహాలు.. ఫినిషనర్‌ను వెతికే పనిలో కోచ్

కనిపిస్తున్న రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు.. (PC: BCCI)

కనిపిస్తున్న రాహుల్ ద్రవిడ్ వ్యూహాలు.. (PC: BCCI)

Rahul Dravid: అప్పడే టీమ్ ఇండియాలో రాహుల్ ద్రవిడ్ మార్కు కనిపిస్తున్నది. మ్యాచ్ వ్యూహాల దగ్గర నుంచి బ్యాటర్లు, బౌలర్లు ఉపయోగించుకునే విధానంలో ద్రవిడ్ శైలి స్పష్టంగా తెలిసిపోతున్నది.

  టీమ్ ఇండియాలో (Team India) అప్పుడే కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) మార్క్ కనిపిస్తున్నది. మ్యాచ్‌కు తగ్గట్లుగా జట్టులో మార్పులు చేయడమే కాకుండా.. సందర్భానికి తగినట్లుగా బౌలర్లను, బ్యాటర్లను ఉపయోగించేలా సూచనలు చేయడం స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో కూడా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా పలు మ్యాచ్‌లు ఆడాడు. కానీ రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో తొలి సారి కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. గత కొన్నాళ్లుగా టీమ్ ఇండియా విజయాల్లో ఓపెనర్లదే కీలక పాత్ర. దీంతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లకు పెద్దగా సవాళ్లు ఎదురయ్యేవి కావు. కానీ ఇటీవల ఓపెనర్లు విఫలం అయితే ఆ తర్వాత జట్టును ఆదుకునే వాళ్లు కరువయ్యారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) గైర్హాజరిలో ఈ లోపం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు ద్రవిడ్ శ్రీకారం చుట్టాడు.

  తొలి టీ20లో కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఫస్ట్ డౌన్‌లో తప్పకుండా పనికి వస్తానని సూర్య తన ఇన్నింగ్స్‌తో చెప్పాడు. కానీ రెండో టీ20కి వచ్చే సరికి ద్రవిడ్ వ్యూహం మార్చాడు. ఓపెనర్లు రాణించి దాదాపు లక్ష్యం వరకు చేర్చారు. అయితే ఆ సమయంలో వికెట్లు పడకుండా టార్గెట్ ఫినిష్ చేసే ఆటగాడిని టెస్ట్ చేయాలని బావించాడు. అందుకే వెంకటేశ్ అయ్యర్‌ను పంపాడు. తొలి మ్యాచ్‌లో కూడా ఫినిషింగ్ కోసమే పంపినా.. అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి అయ్యర్ అవుటయ్యాడు. కానీ రెండో టీ20లో తన పాత్ర ఏమిటో తెలుసుకొని ఆడాడు. పంత్‌తో కలసి మ్యాచ్‌ను ముగించేశాడు.

  Australian Captains: ఏడుస్తూనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియన్ కెప్టెన్లు.. విలేకరుల సమావేశంలో ఏం జరిగింది?


  దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్ నుంచి నెంబర్ 7 వరకు పలు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉన్న వెంకటేశ్ అయ్యర్‌కు ద్రవిడ్ ఈ సిరీస్‌లో పరీక్ష పెట్టాడనే చెప్పాలి. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఇటీవల పూర్తిగా విఫలం కావడంతో అతడి స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకున్నారు. అతడిని బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీసుకున్నా.. ఫినిషర్ స్థానాన్ని అప్పగించాలని ద్రవిడ్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయ్యర్ కూడా తాను ఆ స్థానానికి అర్హుడనే అని నిరూపించుకోవల్సి ఉన్నది. అదే జరిగితే జట్టులోకి హార్దిక్ పాండ్యా తిరిగి రావడం కష్టమే అని చెప్పుకోవచ్చు.

  ఇక హర్షల్ పటేల్‌ను రెండో మ్యాచ్‌లో తీసుకోవడం కూడా ద్రవిడ్ వ్యూహాల్లో భాగమే. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి సీజన్‌లోనే అత్యధిక వికెట్లు (35) తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ పొందాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు తీస్తాడని హర్షల్‌కు పేరుంది. న్యూజీలాండ్ టాపార్డర్ మంచి ఫామ్‌లో ఉండటమే కాకుండా బలంగా కనపడుతున్నది. వారిని విడదీయాలంటే పటేల్ లాంటి బౌలర్లు అవసరమే. అందుకే హర్షల్‌ను తీసుకొని పవర్ ప్లే అనంతరం అతడి చేతికి బంతి అందించారు. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌ల నమ్మకాన్ని హర్షల్ వమ్ముచేయలేదు.

  20 League: ఎమిరేట్స్ టీ20 లీగ్‌లో జట్లు కొన్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్.. లీగ్‌లో భారతీయుల ఆధిపత్యం


  మిగిలిన సీనియర్ బౌలర్లు భారీగా పరుగులిచ్చిన చోటే.. హర్షల్ వికెట్లు తీసి చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇవన్నీ ద్రవిడ్ వ్యహాలే అని తెలుస్తున్నది. వరుసగా రెండు మ్యాచ్‌లలో డిఫరెంట్ అప్రోచ్‌తో టీమ్ ఇండియా కనపడింది. ఏ సమయంలో కూడా డల్‌గా లేకుండా డీల్ చేయడంలో రోహిత్ కూడా సఫలం అయ్యడు. ఇక ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో మూడు మ్యాచ్‌లో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నది.
  Published by:John Kora
  First published:

  Tags: Cricket, India vs newzealand, Rahul dravid, Rohit sharma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు