మాజీ క్రికెటర్, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమ్ ఇండియా (Team India) హెడ్ కోచ్ (Dead Coach) పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రవిశాస్త్రి (Ravi Shastri) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట కొనసాగించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొదటి నుంచి అనిల్ కుంబ్లే లేదా రాహుల్ ద్రవిడ్‌లలో ఒకరికి కోచ్ పదవి అప్పగించాలని భావించాడు. అయితే బోర్డు పెద్దలతో పాటు కొంత మంది టీమ్ ఇండియా క్రికెటర్లలో అనిల్ కుంబ్లేపై విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఎన్ఏసీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ అదే పదవిలో కొనసాగుతానని ప్రకటించాడు. కానీ విదేశీ కోచ్ కంటే రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి అని భావించిన బీసీసీఐ అతడిని ఎట్టకేలకు ఒప్పించింది.
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలో న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్నది. ఆ సిరీస్ నుంచే రాహుల్ ద్రవిడ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తున్నది. బోర్డు పెద్దలు రాహుల్ ద్రవిడ్‌కు రూ. 10 కోట్ల వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ద్రవిడ్ హెడ్ కోచ్ అయితే ఎన్ఏసీ డైరెక్టర్ పదవి ఖాళీ కానున్నది. ఆ పదవికి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను తీసుకోవాలని భావిస్తున్నది. గతంలో ఆ పదవిని ఇస్తామని చెప్పగా వీవీఎస్ తిరస్కరించాడు. కానీ ఇప్పుడు అతడిని ఎలాగైనా ఒప్పించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు.
టీమ్ ఇండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేశాడు.. ఎన్ఏసీ డైరెక్టర్ పదవికి లక్ష్మణ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ కావడంతో రాహుల్ ద్రవిడ్‌ను ఒప్పించి మరీ దరఖాస్తు చేయించారు. రాహుల్ ద్రవిడ్ గతంలో ఇండియా అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్ గా వ్యవహరించాడు. ఇటీవల టీమ్ ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సమయంలో తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ఇక బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. భారత జట్టు మాజీ కీపర్ అజయ్ రాత్రా ఫీల్డింగ్ కోచ్ పదవకి దరఖాస్తు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Rahul dravid, Ravi Shastri, Team India