Happy Birthday Rahul Dravid: నేడు ద్రావిడ్ బర్త్ డే.. మిస్టర్ డిపెండబుల్ గురించి ఈ విషయాలు తెలుసా?

రాహుల్ ద్రావిడ్

Rahul Dravid Birthday Special: ముద్దుగా ది వాల్‌ అని పిలుచుకునే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ నేడు 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకు ద్రావిడ్ తన సేవలు అందించారు.

  • Share this:
    ముద్దుగా ది వాల్‌ అని పిలుచుకునే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ నేడు 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకు ద్రావిడ్ తన సేవలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా ద్రావిడ్‌ భారత క్రికెట్‌కు సేవలు అందిస్తూనే వచ్చాడు. వివాదాలకు దూరంగా ఉండే రాహుల్ ద్రావిడ్ జీవితంలోని కొన్ని విశేషాలను ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1973 జనవరి 11న రాహుల్ ద్రావిడ్ జన్మించాడు. మరాఠి కుటుంబంలో జన్మించిన ఆయన.. బెంటగళూరులో పెరిగాడు. అక్కడే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. అండర్-19లో కర్ణాటక జట్టు తరఫున ఆడాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1996 ఏప్రిల్ 3న శ్రీలంక పై వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. అదే ఏడాది లార్డ్స్ మైదానంలో ఇంగ్లాడ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్. చాలా మ్యాచ్‌లో ద్రావిడ్ ఒంటరి పోరాటం చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చిన సందర్బాలు ఉన్నాయి. వన్డేలో ద్రావిడ్ ఆటతీరుపై కొన్ని విమర్శలు వచ్చిన తన బ్యాట్‌తోనే వాటికి సమధానం చెప్పాడు. టెస్టులో మాత్రం ద్రావిడ్ తనదైన ఆటతో ది వాల్ అని, మిస్టర్ డిపెండబుల్ అని పేరు తెచ్చుకున్నాడు.

    తన కేరీర్‌లో 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో 344 మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్ 10,889 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, ఒకేఒక అంతర్జాతీయ టీ20 ఆడిన ద్రావిడ్ ఆ మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు.

    తన కేరీర్‌లో ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యహరించాడు. 2012లో రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో రాహుల్ సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 89 మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్.. 2013 తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత అండర్-19, భారత్-ఎ జట్లకు ఆయన చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే 2017టీమిండియా కోచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరినప్పటికీ ద్రావిడ్ తిరస్కరించాడని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

    రాహుల్ సొంతం చేసుకున్న ఘనతల్లో కొన్ని..
    2000 సంత్సరంలో ప్రపంచంలోనే బెస్ట్ ఫైవ్ క్రికెటర్స్‌లో ఒకడిగా నిలిచాడు.
    2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
    2006లో ఐసీసీ టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
    2018లో ద్రావిడ్‌కు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటుదక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో భారత క్రికెటర్‌గా ద్రావిడ్ నిలిచాడు.

    ఇక, 1998లో రాహుల్ ద్రావిడ్‌ను అర్జున అవార్డు వరించింది. ఇక, 2004లో పద్మశ్రీ పురస్కారం, 2013లో పద్మభూషణ్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం ద్రావిడ్‌ను సత్కరించింది. వ్యక్తిగత జీవితానికి వస్తే రాహుల్ ద్రావిడ్.. 2003లో ద్రావిడ్ నాగ్‌పూర్‌కు చెందిన వైద్యురాలు విజేత విజేతా పెంధార్కర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సమిత్, అన్వే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: