Rafael Nadal Injury: రాఫెల్ నాదల్ (Rafael Nadal), రోజర్ ఫెడరర్ (Roger Federer), నొవాక్ జొకోవిచ్ (novak djokovic) బిగ్ త్రీ గా టెన్నిస్ (Tennis) ప్రపంచానికి సుపరిచితం. దాదాపు రెండు దశాబ్దాలుగా టెన్నిస్ ను ఏలుతున్న రారాజులు. వీరు ముగ్గురు కలిసి 61 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గారు. ఇందులో నాదల్ వాటా 21 కాగా... ఫెడరర్, జొకోవిచ్ చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గారు. టెన్నిస్ రాకెట్ పట్టిన ప్రతి ప్లేయర్ కూడా తన కెరీర్ లో ఎప్పుడో ఒకప్పుడు ఒక్గ్రాండ్ స్లామ్ గెలిస్తే చాలా అని భావిస్తుంటారు. అలాంటిది ఈ బిగ్ త్రీ ఏకంగా 61 గ్రాండ్ స్లామ్స్ తో టెన్నిస్ కోర్టుల్లో తమ అధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే వీరి ఆధిపత్యం క్రమేమీ తగ్గుతూ వస్తోంది. 40 ఏళ్ల రోజర్ ఫెడరర్ మోకాలి గాయంతో గతేడాది నుంచి మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టలేదు. తాజాగా నాదల్ కూడా తన కెరీర్ ను ముగించే గాయం బారిన పడట్లు వార్తలు వస్తున్నాయి.
రాఫెల్ నాదల్ కెరీర్ ను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే... అతడు తన కెరీర్ ఆసాంతం గాయాలతో సావాసం చేసినట్లు తెలుస్తుంది. 2001లో నాదల్ తన టెన్నిస్ ప్రొఫెషినల్ కెరీర్ ను ఆరంభించాడు. ఆరంభించిన కొన్ని రోజులకే తన ఎడమ పాదం గాయం బారిన పడ్డాడు. డాక్టర్ ను కలిస్తే... నాదల్ ఎడం పాదంలో ఎముకల అమరిక సరిగ్గా లేదని తేల్చారు. ఒకరకంగా చెప్పాలంటే నాదల్ తన పుట్టుకతోనే ఈ సమస్యను కలిగి ఉన్నాడు. మ్యాచ్ ను ఆడే సమయంలో ఎడమ పాదం వల్ల నాదల్ విపరీతమైన నొప్పిని భరించేవాడు. దాంతో కెరీర్ కు గుడ్ బై చెప్పాలని కూడా భావించాడు. అయితే వాళ్ల నాన్న సలహాతో ఇతర డాక్టర్లను సంప్రదించి... నాదల్ పాదానికి అనుగుణంగా ప్రత్యేకమైన షూష్ ను తయారు చేయించారు. అంతేకాకుండా నాదల్ టెన్నిస్ షెడ్యూల్ మరీ ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ నాదల్ 2009లో మోకాలీ గాయం బారిన పడటం... అనంతరం 2016లో మణికట్టు గాయం... ఇలా తన కెరీర్ లో ఎన్నోగాయాలను చూస్తూనే ఉన్నాడు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత నాదల్ తన ఎడమ పాదానికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. దాంతో దాదాపు ఏడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు.
చిన్నప్పటి నుంచి వేధిస్తోన్న ఎడమ పాదం గాయం నుంచి కోలుకున్న స్పెయిన్ బుల్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. మెల్ బోర్న్ వేదికగా జరిగిన టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచిన అతడు... అనంతరం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సొంతం చేసుకుని తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత జరిగిన మెక్సికన్ ఓపెన్ లోనూ టైటిల్ నెగ్గాడు. ఇలా 2022 సీజన్ లో ఓటమనేదే లేకుండా సాగిపోయాడు. ఈ నెలలో జరిగిన ఇండియన్ వేల్స్ టోర్నీలోనూ దూకుడు ప్రదర్శించాడు. అంతా బాగానే సాగుతోందన్న తరుణంలో అభిమానులు షాక్ కు గురైయ్యేలా చేశాడు. ఇండియన్ వేల్స్ టోర్నీలో భాగంగా జరిగిన సెమీస్ మ్యాచ్ లో నాదల్ స్పెయిన్ కే చెందిన అల్కారాజ్ తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మెడికల్ టైమౌట్ కూడా తీసుకున్నాడు. ఎలాగోలా తేరుకున్న అతడు మ్యాచ్ ను గెలిచి ఫైనల్ చేరాడు. అయితే ఫైనల్లో మాత్రం ఓడిపోయాడు. దాంతో 2022లో నాదల్ 20 వరుస విజయాల స్ట్రీక్ కు బ్రేక్ పడింది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ప్రక్కటెముకల గాయం బారిన పడ్డట్లు నాదల్ తెలిపాడు. కోలుకోవడానికి నాలుగు నుంచి 6 వారాల సమయం పట్టొచ్చని అతడు పేర్కొన్నాడు. నాదల్ ప్రస్తుత వయసు 35 ఏళ్లు... స్పోర్ట్స్ లో ఈ వయసు అంటే దాదాపు చరమాంకంలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు ఇదే నాదల్ అభిమానులను భయపెడుతోంది. నాదల్ మళ్లీ రాకెట్ పట్టుకుంటాడా... లేక రాబోయే కొన్ని రోజుల్లో టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే నాదల్ ఈసారి అలాంటి గాయం బారిన పడ్డాడు మరీ. మీరు గనుక అతడి ఇండియన్ వేల్స్ సెమీస్ మ్యాచ్ చూసినట్లయితే... మ్యాచ్ మధ్యలో నాదల్ ఊపిరి తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుస్తుంది. అతడి అభిమానులు మాత్రం నాదల్ గాయం నుంచి కోలుకొని మరిన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గాలని కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Tennis