'క్యాచెస్ విన్ ది మ్యాచెస్' అని క్రికెట్ విశ్లేషకులు పలు మార్లు చెబుతుంటారు. ఒక క్యాచ్ నేలపాలు చేస్తే దాని విలువ ఏంటో మ్యాచ్ పూర్తయిన తర్వాత కానీ అర్దం కాదు. ఐపీఎల్లో (IPL 2021) కూడా ఇలా క్యాచ్‌లు వదిలేసి ఎన్నో మ్యాచ్‌లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య జరిగిన మ్యాచ్ అందుకు ఉదాహరణ. చేపాక్ స్టేడియం పిచ్ చాలా స్లోగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తున్నది. దీన్ని వాడుకున్న పంజాబ్ బౌలర్లు ముంబై ఇండియన్స్‌ను 131 పరుగులకే కట్టడి చేశారు. చేపాక్‌లో తక్కవ స్కోర్లు కాపాడుకున్న సందర్భాలు ఈ సీజన్లోనే చూశాము. ముంబై జట్టు ఢిల్లీపై తక్కువ స్కోరును కాపాడుకుంది. కానీ అదే ముంబై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పొరపాటు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (KL Rahul), మయాంక్ అగర్వాల్ పంజాబ్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రాహుల్ చెలరేగి 63 పరుగులు చేయడంతో పంజాబ్ విజయం సునాయాస మైంది.
అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 21 పరుగుల వద్దే అవుట్ కావాల్సింది. రాహుల్ చాహర్ వేసిన 5వ ఓవర్ మూడో బంతిని కేఎల్ రాహుల్ స్ట్రెయిట్‌గా కొట్టడానికి ప్రయత్నించగా.. అది చాహర్ చేతిని తాకుతూ వెళ్లింది. కాస్త ప్రయత్నించి ఉంటే ఆ బంతినికి సునాయాసంగా పట్టుకోవచ్చు. కానీ వేగంగా వస్తున్న బంతిని అంచనా వేయలేక చాహర్ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ మరో చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ వైపు మళ్లించాడు. ఆ క్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మరో 42 పరుగులు చేయడం గమనార్హం. చాహర్ కనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే పంజాబ్ కింగ్స్‌పై తీవ్రమైన ఒత్తడి పెరిగేది. కానీ క్యాచ్ మిస్ చేసుకొని ముంబై అక్కడే మ్యాచ్ ఓడిపోయింది.
ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో తమ స్థాయికి తగిన ఆటను ప్రదర్శించలేదు. క్యాచ్‌లు మిస్ చేయడమే కాకుండా పలు మార్లు ఫీల్డింగ్ పొరపాట్లు కూడా చేసింది. బౌండరీల వద్ద సునాయాసంగా ఆప గలిగిన బంతులను వదిలేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ వేగంగా పరుగులు చేయగలిగింది. చేపాక్‌లో ఛేదన అంటే అందరూ వణికిపోతున్న సమయంలో మరో 2.2 ఓవర్లు మిగిలి ఉండగానే కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. ముంబై జట్టుకు ఈ పరాజయం పెద్ద మైనస్ కానున్నది. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లా ఆధిపత్యం చెలాయించలేక పోతున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, KL Rahul, Mumbai Indians, Punjab kings