Cricket: ఆస్పత్రిలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. తలకు గాయాలు.. ఐపీఎల్ ఫ్యాన్స్‌లో ఆందోళన

డుప్లెసిస్, ఆండ్రూ రస్సెల్

PSL 2021: సౌతాఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ ఫాప్ డుప్లెసిస్, వెస్టిండీస్‌కు చెందిన ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ గాయాల పాలయ్యారు. ఇద్దరికీ తలకు గాయాలయ్యాయి. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు

 • Share this:
  కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో మళ్లీ టోర్నమెంట్‌ కొనసాగనుంది. యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. యూఏఈ వేదికగా టోర్నెమెంట్ నిర్వహిస్తున్నారు. ఐతే ఈ టోర్నీలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. సౌతాఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ ఫాప్ డుప్లెసిస్, వెస్టిండీస్‌కు చెందిన ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ గాయాల పాలయ్యారు. ఇద్దరికీ తలకు గాయాలయ్యాయి. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో డుప్లెసిస్ గాయపడగా.. బౌన్సర్ బంతికి ఆండ్రే రస్సెల్ గాయపడ్డారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు ఆన్‌ఫీల్డ్‌లో గాయాలు కావడం..ఆ వీడియో వైరల్ కావడంతో.. అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

  శనివారం దుబాయ్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సౌతాఫ్రికా ప్లేయర్ ఈ టోర్నీలో డుప్లెసిస్ క్వెటా టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని అడ్డుకునే క్రమంలో సహచర ఆటగాడైన మహమ్మద్‌ హస్‌నైన్‌ను బలంగా ఢీ కొట్టాడు. హస్‌నైన్‌ మోకాలి చిప్ప బలంగా డుప్లెసిస్ తలకు తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. కిందపడిపోయి అలాగే ఉండిపోయాడు. అతడిని చూసి గ్రౌండ్‌లో అందరూ ఆందోళన చెందారు. మెడికల్ టీమ్ హుటాహుటిన డుప్లెసిస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఇక శుక్రవారం వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రే రసెల్‌ కూడా గాయపడ్డాడు. క్వెటా గ్లాడియేటర్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సిక్సులతో విరుచుకుపడుతున్న రస్సెల్‌కు 14వ ఓవర్లో హమ్మద్ ముసా బౌలింగ్ చేశాడు. నాలుగో బంతిని షార్ట్ బాల్ వేయడంతో.. అది బౌన్స్ అయ్యి రస్సెల్ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఏమైనా దెబ్బ తగిలిందా అని హెల్మెట్ తీసి చూసుకున్నాడు రస్సెల్. ఫిజియో కూడా వచ్చి చెక్ చేశారు. ఏం కాలేదన్నట్లుగా తిరిగి వెళ్లిపోయారు. ఐతే ఆ తర్వాత అదే తరహాలో వేసిన బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు రస్సెల్. ఆ షాట్ తర్వాత తల పట్టేసినట్లు అనిపించడంతో.. అక్కడ కూర్చున్నాడు. అతడి పరిస్థితిని చూసిన మెడికల్ సిబ్బంది స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐతే ప్రమాదమేమీ లేదని స్కానింగ్ కోసమే ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు తెలిపారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


  డుప్లెసిస్, రస్సెల్ ఇద్దరూ క్వెటా టీమ్‌లోనే ఆడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. ఐతే వీరిద్దరి వీడియోలను చూసి.. ఐపీఎల్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఎందుకంటే ఐపీఎల్‌లో డుప్లెసిస్ చెన్నై జట్టుకు, రస్సెల్ కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి బలమైన గాయం తగిలితే ఐపీఎల్‌లో ఆడలేరని టెన్షన్ పడ్డారు. కానీ ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు చెప్పడంతో.. రిలాక్స్ అవుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: