IPL 2021-Qualifier 1: పృథ్వీషా, పంత్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నై ముందు భారీ టార్గెట్ పెట్టిన ఢిల్లీ

చెన్నైకి 173 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఢిల్లీ (PC: IPL)

IPL 2021: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుట ఢిల్లీ క్యాపిటల్స్ 173 పరుగుల టార్గెట్ పెట్టింది. పృథ్వీషా, రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్‌మెయర్ రాణించడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) ప్లే ఆఫ్స్‌లో (Play offs) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య జరుగుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి సరైన శుభారంభం లభించలేదు. పృథ్వీషా (Pruthvi Shaw) దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. వరుసగా బౌండరీలు, సిక్సులు కొడుతూ ధాటిగా ఆడాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (7) విఫలమయ్యాడు. జోష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎంఎస్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (1) జోష్ హాజల్‌వుడ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (10) కూడా నిరాశ పరిచాడు. వికెట్లు పడుతున్న ఓపెనర్ పృథ్విషా మాత్రం తన దూకుడు ఆపలేదు. 34 బంతుల్లో 60 పరుగులు చేసిన పృథ్వీషా.. జడేజా బౌలింగ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.

    ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్‌మెయర్ కలసి చెన్నై సూపర్ కింగ్స్‌పై మరింత దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలసి చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. బౌండరీలు, సిక్సులతో స్టేడియంను మార్మోగించారు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 83 పరుగులు జోడించారు. షిమ్రాన్ హిట్‌మెయర్ (37) డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. రిషబ్ పంత్ చివరి వరకు నిలబడ్డాడు. కేవలం 35 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. జోష్ హాజెల్‌వుడ్ 2 వికెట్లు తీయగా.. జడేజా, మొయిన్ అలీ, బ్రావోలకు తలా ఒక వికెట్ లభించింది.







    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవడానికి 173 పరుగులు అవసరం అవుతాయి. గత మూడు మ్యాచ్‌లు సీఎస్కే ఓడిపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి ఉన్నది. ఈ మ్యాచ్ ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. అందులో ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుతో తలపడుతుంది.
    Published by:John Naveen Kora
    First published: