ప్రొ కబడ్డీ లీగ్ (PKL 8 Season) రోజు రోజుకి అభిమానులకు అసలైన మజా అందిస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు దూరమైన లీగ్.. ఆ లోటును భర్తీ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ లీగ్ లో ప్రతి జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడుతున్నాయ్. గెలుపు దక్కించుకోవడం కోసం తగ్గేదే లే అన్నట్టుగా తాడో పేడో తేల్చుకుంటున్నాయ్. కానీ, ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8 మాత్రం తెలుగు టైటాన్స్ (Telugu Titans)కు పెదగా కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు సన్ రైజర్స్,
పంజాబ్ కింగ్స్ దరిద్రం టైటాన్స్ కు పట్టుకున్నట్టుంది. ఐపీఎల్ 2021 సీజన్లో దారుణమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్.. 14 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు టైటాన్స్ ది కూడా అదే పరిస్థితి.
ప్రొకబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో 10 మ్యాచుల్లో ఓడిపోయిన టైటాన్స్.. మరో మూడు మ్యాచుల్ని టైగా ముగించింది. దీంతో, ఫ్యాన్స్ తెలుగు టైటాన్స్ పై ఫైరవుతున్నారు. అచ్చం సన్ రైజర్స్ టీమ్ లానే మీరు కూడా మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ తో అమీతుమీ తేల్చుకోనుంది తెలుగు టైటాన్స్ (Telugu Titans Vs Bengal Warriors). కనీసం, ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు దక్కించుకుంటే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
2018 (ఆరో సీజన్)లో బెంగళూరు బుల్స్‌ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్‌ని జట్టులోకి తీసుకున్న తెలుగు టైటాన్స్.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. అయితే, ఈ సీజన్ లో రోహిత్ కుమార్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రైడింగ్ లో పూర్తిగా డిఫెన్స్ లోకి పోతున్నాడు. అందుకే అతన్ని గత మ్యాచులో పక్కన పెట్టారు. అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్, సురీందర్, అరుణ్‌ని జట్టులో కీ ప్లేయర్లు. కానీ, వీళ్లు కూడా స్థాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు.
ప్రొ కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరొందిన సిద్ధార్థ్ దేశాయ్ గాయంతో.. జట్టుకు దూరయ్యాడు. కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కీలక సమయాల్లో డిఫెన్స్ లో తప్పిదాలు చేసి మ్యాచ్ ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్. ఈ తప్పులు సరిచేసుకుంటే.. తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. యంగ్ రైడర్ అంకిత్ బెన్వాల్, రజనీశ్ దలాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. గత రెండు మ్యాచుల్లో ఆదర్శ్ టి మెరుగైన ప్రదర్శన చేశాడు.
మరోవైపు, బెంగాల్ వారియర్స్ ఈ సీజన్ లో ఫర్వాలేదనిపిస్తోంది. ఆడిన 14 మ్యాచుల్లో 7 గెలిచి.. ఆరు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. దీంతో, 41 పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ లో మణిందర్ సింగ్ కీ రైడర్. ఈ సీజన్ లో మణిందర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దర్శన్, అమిత్ నర్వాల్, అబ్జోర్ మిగానీ వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు బెంగాల్ సొంతం. ఇక, ఈ సీజన్ లో టైటాన్స్ తో జరిగిన మ్యాచులో బెంగాల్ దే పై చేయి. 28-27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ తెలుగు టైటాన్స్ పై సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో, మరోసారి.. అదే ప్రదర్శనను రిపీట్ చేయాలని బెంగాల్ వారియర్స్ భావిస్తోంది.
హెడ్ టు హెడ్ రికార్డులు :
హెడ్ టు హెడ్ రికార్డుల్లో తెలుగు టైటాన్స్ పై బెంగాల్ వారియర్స్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. 10 సార్లు బెంగాల్ వారియర్స్ గెలవగా.. కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే టైటాన్స్ నెగ్గింది. మరో 4 మ్యాచులు టై అయ్యాయ్.
ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా:
తెలుగు టైటాన్స్ : రోహిత్ కుమార్, ఆదర్శ్ టి, అంకిత్ బెన్వాల్, సురీందర్ సింగ్, ఆకాశ్ చౌదరీ, సి అరుణ్, సందీప్ కండోలా
బెంగాల్ వారియర్స్ : మణిందర్ సింగ్, సుకేష్ హెగ్డే, మహ్మద్ నభీక్షక్ష్, విజిన్ తంగదురై, దర్శన్ జె, రణ్ సింగ్, అబ్జోర్ మిగానీ
పూర్తి స్క్వాడ్స్ :
తెలుగు టైటాన్స్ జట్టు:
రైడర్స్: అమిత్ చౌహాన్, అంకిత్ బేనివాల్, గల్లా రాజు, హ్యున్సూ పార్క్, రజినీశ్, రాకేశ్ గౌడ, రోహిత్ కుమార్, సిద్దార్థ్ దేశాయ్
డిఫెండర్స్: ఆకాశ్ దత్తు అర్సుల్, ఆకాశ్ చౌదరి, మనీశ్, ఆదర్శ్ టి, సి. అరుణ్, ప్రిన్స్ డి, రుతురాజ్ కొరవి, సురీందర్ సింగ్, ఎస్తురో అబే, సందీప్ కండోలా
బెంగాల్ వారియర్స్ :
రైడర్స్: ఆకాశ్ పికల్ముండే, మనీందర్ సింగ్. రవీంద్ర కుమావత్, రిషాంక్ దేవడిగ, సుకేశ్ హెడ్జ్, సుమిత్ సింగ్,
డిఫెండర్: దర్శన్ జే, విజిన్ తంగదురయ్, వినోద్ కుమార్, అమిత్ , ప్రవీణ్, సచిన్ విట్టల, అబ్జోర్ మొహజెర్మిగాని, రింకు నర్వాల్, రోహిత్ బన్నే
ఆల్‌రౌండర్ : ఇస్మాయిల్ నబీబక్ష్, మనోజ్ గౌడ, రోహిత్