PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022లో తెలుగు టైటాన్స్ (Telugu Titans) చెత్తాటతో అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గతేడాది కంటే కూడా పేలవ ప్రదర్శనతో ఇప్పటికే నాకౌట్ చేరుకునే అవకాశాలను కోల్పోయింది. గతేడాది జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8లో ఆడిన 22 మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లోనే నెగ్గి 27 పాయింట్లతో టేబుల్ లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది అయితే మరీ దారుణ ప్రదర్శన చేస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 19 మ్యాచ్ ల్లో రెండింటిలో మాత్రమే నెగ్గి 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నా తెలుగు టైటాన్స్ మాత్రం విజయాల బాట పట్టడం లేదు.
ఇక తాజాగా జైపూర్ పింక్ పాంథర్స్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 28-48 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో చిత్తయ్యింది. తెలుగు టైటాన్స్ నుంచి ఒక్క రైడర్ కూడా కనీసం 5 పాయింట్లు సాధించలేకపోవడం గమనార్హం. డిఫెన్స్ లో పర్వేశ్ 7 ట్యాకిల్ పాయింట్లతో..విశాల్ భరద్వాజ్ 4 ట్యాకిల్ పాయింట్లతో ఫర్వాలేదనిపించారు. వీరు కూడా ఆడకపోయి ఉంటే తెలుగు టైటాన్స్ 15 పాయింట్లు కూడా సాధించి ఉండకపోయేది. ఇక జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 18 రెయిడ్ పాయింట్లతో తెలుగు టైటాన్స్ ను హడలెత్తించాడు. అంకుశ్ 6 పాయింట్లతో రాణించాడు. వీరిద్దరు కలిసే తెలుగు టైటాన్స్ ను ఓడించారు.
తాజా ఓటమితో తెలుగు టైటాన్స్ మరింత డీలా పడింది. ప్రొకబడ్డీ లీగ్ చరిత్రలో సీజన్ లో 8లో తెలుగు టైటాన్స్ అత్యంత చెత్త ప్రదర్శనగా ఉంది. అయితే తాజా సీజన్ తో దానిని చెరిపేసి అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసేలా తెలుగు టైటాన్స్ కనిపిస్తుంది. గత సీజన్ లో తెలుగు టైటాన్స్ 27 పాయింట్లను సాధించింది. ఈ ఏడాది టైటాన్స్ ఇప్పటి వరకు 15 పాయింట్లను మాత్రమే సాధించింది. 27 పాయింట్ల మార్కును దాటాలంటే తెలుగు టైటాన్స్ మరో 13 పాయింట్లు సాధించాల్సి ఉంది. మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ తెలుగు టైటాన్స్ నెగ్గాల్సి ఉంది. అది కూడా కనీసం 7 పాయింట్ల తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడే గెలుపు సాధించిన ప్రతిసారి 5 పాయింట్లు ఖాతాలో చేరతాయి. ఒక వేళ 7 పాయింట్ల కంటే కూడా తక్కవ తేడాతో నెగ్గితే 4 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఇక ప్రస్తుతం తెలుగు టైటాన్స్ ఉన్న ఫామ్ ను చూస్తే మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గడం కష్టంగానే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Jaipur, Kabaddi, Pro Kabaddi League