PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. 12 జట్లతో గత నెలలో ఆరంభమైన ప్రొ కబడ్డీ లీగ్ లో ప్రస్తుతం ఆరు జట్లు మాత్రమే మిగిలాయి. టాప్ 6లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. టాప్ 2లో నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers), పుణేరి పల్టాన్ (Puneri Paltan) నేరుగా సెమీఫైనల్ కు చేరుకున్నాయి. మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన బెంగళూరు బుల్స్, యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్, దబంగ్ ఢిల్లీలు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంది. క్వార్టర్ ఫైనల్స్ లాంటి ఈ మ్యాచ్ ల్లో మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు పోటీ పడతాయి. ఈ రెండు మ్యాచ్ ల్లో గెలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. మంగళవారం (డిసెంబర్ 13న) ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరగనున్నాయి.
బెంగళూరు బుల్స్ తో దబంగ్ ఢిల్లీ
మంగళవారం జరిగే తొలి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ తో దబంగ్ ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన బెంగళూరు జట్టు ఆ తర్వాత పుంజుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ప్ కు అర్హత సాధించింది. భరత్, సచిన్ నర్వాల్, వికాశ్ ఖండోలాలు ఫామ్ లో ఉండటం బెంగళూరు జట్టుకు ప్లస్ పాయింట్. ఇక మరోవైపు సీజన్ ను ఘనంగా ఆరంభించిన దబంగ్ ఢిల్లీ ఆ తర్వాత గాడి తప్పింది. చివరకు కిందా మీదా పడుతూ ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. నవీన్ కుమార్ పైనే ఆధారపడుతుండటం ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. మునుపటిలా నవీన్ కుమార్ చెలరేగలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
యూపీ యోధాస్ తో తమిళ్ తలైవాస్
మంగళవారం రోజే మరో ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా జరగనుంది. రెండో ప్లే ఆఫ్ మ్యాచ్ లో యూపీ యోధాస్ తో తమిళ్ తలైవాస్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి గం. 8.30 నుంచి ఆరంభం కానుంది. తమిళ్ తలైవాస్ లో హిమాన్షు, విశ్వనాథ్, సచిన్ లు రెచ్చిపోతున్నారు. ఈ మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు
బెంగళూరు బుల్స్ X దబంగ్ ఢిల్లీ (రా. గం. 7.30లకు)
యూపీ యోధాస్ X తమిళ్ తలైవాస్ (రా.గం.8.30లకు)
ఈ మ్యాచ్ లను స్టార్ స్టోర్ట్స్ నెట్ వర్క్, హాట్ స్టార్ లో ప్రత్యక్షప్రసారం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Jaipur, Kabaddi, Pro Kabaddi League, Tamil nadu