హోమ్ /వార్తలు /క్రీడలు /

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ లో బుల్స్ రైజ్.. టై బ్రేక్ లో నెగ్గిన తలైవాస్.. సెమీస్ లో ఎవరు ఎవరితో అంటే?

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ లో బుల్స్ రైజ్.. టై బ్రేక్ లో నెగ్గిన తలైవాస్.. సెమీస్ లో ఎవరు ఎవరితో అంటే?

PC : TWITTER

PC : TWITTER

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఒక మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. మరొక మ్యాచ్ లో యూపీ యోధాస్ (UP Yodhas), తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) జట్లు చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PKL 2022 : ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా ముగిశాయి. ఒక మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. మరొక మ్యాచ్ లో యూపీ యోధాస్ (UP Yodhas), తమిళ్ తలైవాస్ (Tamil Thalaivas) జట్లు చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే టై బ్రేక్ లో నెగ్గిన తలైవాస్ సెమీస్ బెర్త్ ను సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో బెంగళూరు బుల్స్ 56-24 తేడాతో దబంగ్ ఢిల్లీ (Dabang Delhi)పై అలవోక విజయాన్ని అందుకుంది. అనంతరం యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య రెండో ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరు జట్లు 36-36తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు టై బ్రేకర్ అవసరం కాగా.. ఇందులో తలైవాస్ 6-4తో నెగ్గి సెమీస్ లో అడుగుపెట్టింది.

తొలి ప్లే ఆఫ్ పోరులో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ అంచనాలకు తగ్గట్లే ఆడింది. వరుస పాయింట్లతో దబంగ్ ఢిల్లీపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భరత్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికాశ్ ఖండోలా 13 పాయింట్లతో అతడికి చక్కటి సహకారం అందించాడు. వీరికి డిఫెండర్ సుబ్రమణ్యం (7 పాయింట్లు) కూడా తోడవ్వడంతో ఢిల్లీ జట్టు విలవిల్లాడింది. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 8 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు. నాకౌట్ మ్యాచ్ లో 32 పాయింట్ల తేడాతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ వ్యత్యాసాన్ని చూస్తేనే అర్థం అవుతుంది మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ఏ రేంజ్ లో డామినేట్ చేసిందో అని.

అనంతరం జరిగిన మరో మ్యాచ్ నువ్వా నేనే అన్నట్లు ఆఖరి క్షణం వరకు సాగింది. యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత 40 నిమిషాల ఆట 36-36తో టై అయ్యింది. ఆట ఆఖరి నిమిషాల్లో యూపీ యోధాస్ రెండు పాయింట్లతో లీడ్ లో నిలిచింది. అయితే చివర్లో కమ్ బ్యాక్ చేసిన తమిళ్ తలైవాస్ రెండు పాయింట్లు సాధించి స్కోర్ ను సమం చేసింది. దాంతో మ్యాచ్ టై బ్రేకర్ కు దారి తీసింది. టై బ్రేకర్ లో 6-4తో నెగ్గిన తలైవాస్ సెమీస్ చేరింది. తలైవాస్ తరఫున నరేందర్ 14 పాయింట్లతో రెచ్చిపోయాడు. అజింక్యా పవార్ 11 పాయింట్లు సాధించాడు. యూపీ యోధాస్ తరఫున ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లు సాధించాడు.

టై బ్రేకర్ అంటే ఏమిటి?

పీకేఎల్ లో లీగ్ దశలో మ్యాచ్ లు టై అయితే పాయింట్లను సరి సమానంగా ఇరు జట్లకు పంచుతారని మనకు తెలుసు. అయితే నాకౌట్ దశలో మ్యాచ్ లు టై అయితే అప్పుడు ఎలా? దీనికి టై బ్రేకర్ తో నిర్వాహకులు చెక్ పెట్టారు. నాకౌట్ మ్యాచ్ లు టైగా ముగిస్తే అప్పుడు విజేతను తేల్చడానికి ట్రే బ్రేకర్ కు వెళ్తారు. టై బ్రేకర్ ఫుట్ బాల్ పెనాల్టీ షూటైట్ లానే ఉంటుంది. టై బ్రేకర్ లో ప్రతి జట్టు నుంచి ఐదుగురు రెయిడర్లు (వేర్వేరు) కూతకు వెళ్తారు. అవతలి జట్టు ఫుల్ టీంతో వారిని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి జట్టు కూడా ఐదు సార్లు కూతకు వెళ్లొచ్చాక ఏ జట్టయితే అత్యధిక పాయింట్లతో ఉంటుందో ఆ జట్టు గెలుస్తుంది. సెమీఫైనల్ మ్యాచ్ లు డిసెంబర్ 15న జరుగుతాయి.

సెమీస్ లో ఎవరు ఎవరితో

జైపూర్ పింక్ పాంథర్స్ X బెంగళూరు బుల్స్ (రాత్రి గం. 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం)

పుణేరి పల్టాన్ X తమిళ్ తలైవాస్ (రాత్రి గం. 8.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం)

స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చానెల్స్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి

First published:

Tags: Bengaluru, Delhi, Kabaddi, Pro Kabaddi League, Tamil nadu

ఉత్తమ కథలు