PM Narendra Modi : టీమిండియాను చూసి నేర్చుకోవాలి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు

PM Narendra Modi

PM Narendra Modi : గబ్బాలో గర్జించి..అనుభవం లేని కుర్రాళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

  • Share this:
    గబ్బాలో గర్జించి..అనుభవం లేని కుర్రాళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారితో ఇండియా పోరును.. ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలుపుతో పోల్చారు. ఆ గెలుపు స్ఫూర్తితోనే దేశ ప్రజలు సవాళ్లపై పోరాడాలన్నారు. తేజ్ పూర్ యూనివర్సిటీ విద్యార్థుల స్నాతకోత్సవంలో ప్రధాని శుక్రవారం వర్చువల్ గా మాట్లాడారు. " ఎన్నో సవాళ్ల మధ్య టీమిండియా గబ్బా టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొదటి పరీక్షలో ఓడిపోయిన తరువాత కూడా పోరాటం కొనసాగించారు. గాయాలు వెంటాడినా కొత్త పరిష్కారాలను కనుకొన్నారు. జట్టు సభ్యుల అనుభవం తక్కువే అయినా.. వారి ఆత్మవిశ్వాసం అమోఘం. దీంతోనే చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఒక జీవిత పాఠం. సానుకూల ఫలితాలను రాబట్టేందుకు సానుకూల మనస్తత్వం ఎంతో అవసరం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ సారం' అని ప్రధాని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

    ప్రతి విషయంలోనూ మన చర్య ప్రతిచర్యల పరమార్థమే మారిపోయిందన్నారు. ఏం జరుగుతుందోనని మహమ్మారి మొదలైన మొదట్లో జనమంతా భయపడ్డారని, కానీ, యావత్ దేశం ఎంతో దృఢచిత్తాన్ని ప్రదర్శించిందని అన్నారు. కరోనా మహమ్మారికి దేశీయంగానే పరిష్కారాలు కనుగొన్నామని, వాటితోనే కరోనాపై పోరాడామని ఆయన గుర్తు చేశారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లే అందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఆగస్టు నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుందని, ఇప్పటి నుంచి అంతా ఓ నవ భారత నిర్మాణం కోసం బతకాలని, ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేయాలని అన్నారు. ఈ ఏడాది నుంచి వందో స్వాతంత్ర్య దినోత్సవం వరకు యువతదే బంగారు భవిత అని అన్నారు.

    తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమితో పాటు అప్రతిష్టను మూటగట్టుకున్న టీమిండియా తర్వాత రెచ్చిపోయింది. ఇక సిరీస్ లో గెలవడం కష్టమనుకుంటే.. గోడకు కొట్టిన బంతిలా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గి సిరీస్‌ చేజిక్కించుకుంది. కెప్టెన్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనమైనా.. అతడి స్థానంలో పగ్గాలు అందుకున్న రహానే జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు.
    Published by:Sridhar Reddy
    First published: