విశ్వక్రీడలు ఒలింపిక్స్ (Olympics) కు కౌండ్ డౌన్ షూరు అయింది. జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని.. మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల శుభాకాంక్షలతో పాటు, దీవెనలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలో, క్రీడా కారులందరికి వ్యాక్సినేషన్‌తో పాటు, సరైన శిక్షణ , ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఒక్కో క్రీడాకారుడి ప్రతిభతో మరో వంద మంది స్ఫూర్తిని పొందుతారని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గోనే క్రీడాకారుల బృందంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో దేశమంతా వారివెంటే నిలుస్తుందని అన్నారు.
టోక్యోలో జరగబోయే ఈ క్రీడల్లో మన దేశం నుంచి 11 క్రీడా విభాగాలలో మొత్తం 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారని తెలిపారు. అయితే, జూన్ చివరి నాటికి మరో 25 మంది వివిధ క్రీడలకు అర్హత సాధించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు మరో 50 రోజుల గడువు మిగిలి ఉందన్న సంగతి తెలిసిందే.
మరోవైపు, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు.. భారత అథ్లెట్ల జెర్సీలను, అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులలో జెర్సీలు డిజైన్ చేయబడగా, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేక సూట్లు రూపొందించబడ్డాయి. అయితే, షెడ్యూల్ ప్రకారం గతేడాది(2020) జరగాల్సిన విశ్వక్రీడలు.. ఈ ఏడాది జులైకి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, PM Narendra Modi, Tokyo Olympics