Modi With Paralympics stars: పారా ఒలంపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోదీ ఆతిథ్యం.. వీడియోను షేర్ చేసిన మోదీ.. వారితో ఏం చెప్పారంటే..

పారా ఒలంపిక్స్ స్టార్స్‌తో ప్రధాని మోదీ

టోక్యో పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిద్యం వహించి పతకాలు సాధించిన  అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) గురువారం రోజున తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు.

  • Share this:
    టోక్యో పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిద్యం వహించి పతకాలు సాధించిన  అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) గురువారం రోజున తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను నేడు మోదీ.. ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. గురువారం రోజున పారా ఒలంపిక్స్‌ అథ్లెట్లకు వారి కోచ్‌లకు ప్రధాని మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పారా ఒలంపిక్స్‌లో(Paralympics) పతకాలు సాధించిన భారత అథ్లెట్లను మోదీ అభినందించారు. పారా ఒలంపిక్స్ భారత అథ్లెట్లు సాధించిన విజయాలు.. దేశవ్యాప్తంగా క్రీడా సమాజం ధైర్యాన్ని పెంపొందిస్తుందని మోదీ అన్నారు. వీరి విజయం.. భారత్‌‌ నుంచి మరింత మంది క్రీడాకారులను అభివృద్ది చేస్తుందని, వారికి అంతర్జాతీయ వేదికపైన వారికంటూ గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తుందని మోదీ అన్నారు.

    దేశంలోని ఒక వర్గానికి వివిధ రకాల క్రీడల గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పారు. వారి ముందు అందుబాటులో ఉన్న ఎంపికల గురించే తెలుసుకుంటారని అన్నారు. ‘మీరు పడిన కష్టం వల్ల.. ఈ రోజు మీరు బాగా ప్రసిద్ది చెందారు. మీరందరూ ప్రజలను చైతన్యపరచగలరు. పెద్ద మార్పులు తీసుకురావడంలో సహాయపడగలరు... నేను ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటాను’అని ప్రధాని మోదీ అథ్లెట్లతో చెప్పారు.

    ప్రధాని తమతో కూర్చొని మాట్లాడటం, తమను ఆహ్వానించి అభినందించడం గౌరవంగా భావిస్తున్నామని అథ్లెట్లు అన్నారు. అలాగే పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు.. వారి ఆటోగ్రాఫ్‌తో కూడిన పరికరాలను బహుమతిగా ఇచ్చారు. వీటిని తర్వాత వేలం వేయనున్నట్టుగా మోదీ చెప్పారు. మోదీ చెప్పిన మాటను అథ్లెట్లు స్వాగతించారు.





    టోక్యోలో 2020 సమ్మర్ పారాలింపిక్స్ ఈ సంవత్సరం ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 5 వరకు జరిగిన సంగతి తెలిసిందే. పారా ఒలంపిక్స్‌లో భారత్ అధికారిక అరంగేట్రం 1968 సమ్మర్ పారా ఒలింపిక్స్‌లో జరిగింది. ఇక, 1984 నుంచి ప్రతి పారా ఒలంపిక్స్‌లో భారత్ పాల్గొంటూ వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పారా ఒలంపిక్స్‌లో భారత్ సత్తా చాటింది. భారత అథ్లెట్లు.. మొత్తం 19 పతకాలు(ఐదు స్వర్ణం, ఎనిమిది రజత, ఆరు కాంస్య) సాధించారు. ఇక, టోక్యో 2020 పారా ఒలంపిక్స్‌కు ముందు.. భారత్ అన్ని పారా ఒలంపిక్స్‌లో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది. అందులో 4 స్వర్ణం, 4 రజతం, 4 కాంస్యం ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: