హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021: ఐపీఎల్ వెంటనే ఆపేయాలంటూ బాంబే, ఢిల్లీ హైకోర్టుల్లో పిటిషన్లు.. ప్రజలు చావుబతుకుల్లో ఉంటే క్రికెట్ అవసరమా?

IPL 2021: ఐపీఎల్ వెంటనే ఆపేయాలంటూ బాంబే, ఢిల్లీ హైకోర్టుల్లో పిటిషన్లు.. ప్రజలు చావుబతుకుల్లో ఉంటే క్రికెట్ అవసరమా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐపీఎల్ 2021ని (IPL 2021) వెంటనే ఆపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) మంగళవారం ఒక పిటిషన్ దాఖలైంది. ప్రజల ఆరోగ్యాలను పక్కన పెట్టి ఐపీఎల్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో వెంటనే విచారణ చేపట్టాలని లాయర్ కరన్ సింగ్, సామాజిక కార్యకర్త ఇందర్ మోహన్ సింగ్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కోర్టు వెంటనే జోక్యం చేసుకొని బీసీసీఐ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)ను ఐపీఎల్ ఆపడానికి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోవిడ్ 19తో బాధపడుతున్న న్యాయవాది కరన్ సింగ్ ఢిల్లీలో వైద్య వ్యవస్థ పూర్తిగా విఫలమైందని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. 'ఒకవైపు ప్రజలు కరోనా బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక.. శ్మశానాల దగ్గర ఖననం కోసం క్యూలు కడుతూ ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య అత్యయిక స్థితి నెలకొన్నది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ నిర్వహణకు సహకరించడం ఏ మాత్రం సమంజసం కాదు' అని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంటనే తాము పేర్కొన్న ప్రతివాదులకు ఐపీఎల్‌పై దిశానిర్దేశం చేయాలని.. ప్రజల ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.

ఈ పిటిషన్‌లో భారత ప్రభుత్వం, బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ అసోసియేషన్, ఢిల్లీ ముఖ్యమంత్రులను ప్రతివాదులుగా చేర్చారు. వారందరికీ వెంటనే ఐపీఎల్ ఆపేయాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


మరోవైపు బాంబే హైకోర్టులో (Bombay High Court) కూడా ఐపీఎల్‌ను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఐపీఎల్ కోసం ఉపయోగిస్తున్న వనరులను కోవిడ్-19 పోరాటంలో ఉపయోగించాలని పిటిషనర్లు పిల్‌లో కోరారు. ఈ మేరకు బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. కాగా, ఈ వ్యాజ్యంపై బాంబే హైకోర్టు గురువారం విచారణ చేపట్టనున్నది.

First published:

Tags: Bcci, Bombay high court, Delhi High Court, IPL 2021

ఉత్తమ కథలు