హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics: నేటి నుంచే పారాలింపిక్స్.. మన దేశం నుంచి ఎంత మంది? ఆ దేశానికి అరుదైన గౌరవం

Paralympics: నేటి నుంచే పారాలింపిక్స్.. మన దేశం నుంచి ఎంత మంది? ఆ దేశానికి అరుదైన గౌరవం

నేటి నుంచే పారాలింపిక్స్ 2020.. ఆ దేశానికి అరుదైన గౌరవం (PC: Paralympics/Twitter)

నేటి నుంచే పారాలింపిక్స్ 2020.. ఆ దేశానికి అరుదైన గౌరవం (PC: Paralympics/Twitter)

దివ్యాంగుల విశ్వక్రీడలు నేడు టోక్యో వేదికగా ప్రారంభం కానున్నాయి. ఇండియా నుంచి 54 మంది పారా అథ్లెట్లు 9 క్రీడాంశాల్లో పాల్గొనడానికి టోక్యో చేరుకున్నారు.

టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics) ముగిసి దాదాపు రెండు వారాలు అవుతున్నది. కానీ అదే టోక్యో వేదికగా మరో మెగా క్రీడాలు మంగళవారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. శరీర వైకల్యం ఉన్న అథ్లెట్లు ఈ విశ్వక్రీడల్లో పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4500 మంది పారా అథ్లెట్లు ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒలింపిక్స్‌లో విధించినట్లు గానే పారాలింపిక్స్‌కు (Paralympics) కూడా నిబంధనలు, ప్రోటోకాల్స్ కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. అథ్లెట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సిబ్బందిని కూడా భారీగా నియమించారు. ఇప్పటికే క్రీడాగ్రామంలో అథ్లెట్లు సందడి చేస్తున్నారు. కాగా, మంగళవారం సాయంత్రం జరుగనున్న పరేడ్‌కు పరిమిత సంఖ్యలో అథ్లెట్లను అనుమతించారు. అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలను చేతబట్టి ఈ పరేడ్‌లో పాల్గొననున్నారు. భారత బృందం నుంచి ఐదుగురు పారా అథ్లెట్లు, ఆరుగురు అధికారులను పరేడ్‌కు అనుమతించారు. మరియప్పన్ తంగవేలు (Mariyappan Tangavelu) మన జాతీయ జెండాను చేతబట్టి పరేడ్‌లో ముందు నడవనున్నాడు. మార్చ్ ఫాస్ట్‌లో 17వ దేశంగా ఇండియా నడువనున్నది. తంగవేలుతో పాటు వినోద్ కుమార్, టెక్ చంద్, జైదీప్, సకీనా ఖాతూన్ ఈ పరేడ్‌లో పాల్గొననున్నారు.

ఇక ఈ పరేడ్‌లో అఫ్గానిస్తాన్ అథ్లెట్లు పాల్గొనక పోయినా వారి జాతీయ జెండా రెపరెపలాడనున్నది. అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ దేశ అథ్లెట్లు టోక్యో చేరుకోలేక పోయారు. దీంతో అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అరుదైన నిర్ణయం తీసుకున్నది. అఫ్గానిస్తాన్‌కు సంఘీభావంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్ పతాకాన్ని పట్టుకొని పరేడ్‌లో నడుస్తాడని పారాలింపిక్ కమిటీ చీఫ్ అండ్రూ పార్సన్స్ వెల్లడించారు.

ఇక ఈ సారి పారాలింపిక్స్‌లో పాల్గొనబోయే అథ్లెట్లలో అందరి దృష్టి బ్రెజిల్ దిగ్గజ స్విమ్మర్ డానియెల్ డియాస్ మీదనే ఉన్నది. ఇప్పటి వరకు మూడు పారాలింపిక్ పోటీల్లో పాల్గొని 24 పతకాలు గెలుచుకున్న డానియెల్‌కు టోక్యో పారాలింపిక్స్ నాలుగవది. ఈ సారి కూడా స్విమ్మింగ్‌లో సత్తా చాటి తన పతకాల సంఖ్య 30కి పెంచుకుంటాడని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు 9 ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నారు. గత రియో ఒలింపిక్స్‌లో భారత్ రెండు స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం దక్కించుకున్నది. ఈ సారి 15 పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్ల బృందం పట్టుదలగా ఉన్నది.


నేటి నుంచి ప్రారంభం కానున్న పారాలింపిక్స్ సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతాయి. మొత్తం 163 దేశాల నుంచి 4500 అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. మొత్తం 22 క్రీడలకు సంబంధించిన 540 ఈవెంట్లు జరుగనున్నాయి.

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు