పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఎఫ్53 కేటగిరిలో ఆదివారం కాంస్య సాధించిన అథ్లెట్ వినోద్ కుమార్‌ను నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించారు. అతడి కేటగిరీపై ఇతర అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సోమవారం తిరిగి అసెస్మెంట్ చేసి అనర్హుడిగా ప్రకటించడంతో కాంస్యం కోల్పోవలసి వచ్చింది.
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో (Paralympics 2020) ఆదివారం భారత అథ్లెట్లు రాణించారు. టేబుల్ టెన్నిస్‌లో భవానీబెన్ పటేల్ (Bhavaniben Patel) రజత పతకం సాధించింది. ఇక హైజంప్ టీ47లో నిషాద్ కుమార్ (Nishad Kumar) కాంస్య పతకం సాధించాడు. డిస్కస్ త్రో ఎఫ్ 52లో వినోద్ కుమార్(Vinod Kumar) 19.91 మీటర్ల దూరం విసిరి మూడోస్థానంలో నిలిచాడు. అతడి కంటే ఎక్కువ దూరం పోలెండ్‌కు చెందిన పయిటర్ కోస్‌విజ్ (20.02 మీటర్లు), క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండోర్ (19.98 మీటర్లు) విసిరాడు. అయితే స్వర్ణ పతకం, రజత పతకాలను అందజేసిన నిర్వాహకులు.. భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్‌కు మాత్రం పతకం అందించలేదు. ఎఫ్52 కేటగిరీలో బలహీన కండరాల శక్తి, పరిమిత అవయవాల కదలిక, కాళ్ల పొడవులో వ్యత్యాసం వంటి అర్హతలపై ఇతర అథ్లెట్లు పిర్యాదు చేశారు. దీంతో అతడి కేటగిరీని మరోసారి పరిశీలించి సోమవారం నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. పారాలింపిక్స్ 2020నిర్వాహకులు వినోద్ కుమార్‌ను అనర్హుడిగా (Ineligible) ప్రకటించారు. డిజేబిలిటీ క్లాసిఫికేషన్‌లో అతడు అనర్హుడిగా మారడంతో కాంస్య పతకం అందించడం లేదని చెప్పింది. వినోద్ కుమార్ కేటగిరీ కేటాయింపుపై సోమవారం మరోసారి రీఅసెస్మెంట్ చేశారు. అతడి నడుము కింది భాగం, కండరీల బలహీనతల్లో విఫలమయ్యాడని పేర్కొన్నారు.
సాధారణంగా పారా అథ్లెట్లు వారి అవయవ లోపాలకు సంబంధించి ముందే వర్గాకరణ చేయించుకోవాలి. దాని ప్రకారం వారి కేటగిరీ ఆధారంగా పోటీలు నిర్వహిస్తారు. వినోద్‌కు అగస్టు 22న నిర్వాహకులు వర్గీకరణ చేపట్టి ఎఫ్52 కేటగిరీ కేటాయించారు. అయితే అప్పటి నుంచే ఇతర అథ్లెట్లు వినోద్ కేటగిరీపై పిర్యాదులు చేస్తూ వచ్చారు. అతడు నిబంధనల ప్రకారం ఎఫ్52 కేటగిరీ కిందకు రాడని వాళ్లు ఆరోపించారు. కానీ నిర్వాహకులు అప్పుడు ఏమీ మాట్లాడకుండా చివరకు ఫైనల్ పోటీల ఫలితాలు వెలువడిన తర్వాత అతడిని రీ-అసెస్మెంట్ చేస్తామని చెప్పారు. దీంతో భారత శిబిరంలో అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడు తాజాగా వినోద్ కుమార్ తన కాంస్య పతకాన్ని కోల్పోవలసి వస్తున్నది.
సాధారణంగా 50ల కేటగిరీలో అథ్లెట్లు అందరూ కూర్చున్న స్థితిలో పోటీ పడుతుంటారు. వీల్ ఛెయిర్‌కి పరిమితం అయిన వాళ్లు ఈ కేటగిరీ కిందకు వస్తారు. వాళ్లు వీల్ చెయిర్ లేదా త్రోయింగ్ చెయిర్లో కూర్చొని డిస్కస్ త్రోలో పాల్గొంటారు. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోవడంతో పాటు పరిమితంగా కండరాల కదలిక కలిగి త్రోయింగ్ చెయిర్లో కూర్చొని ఉన్న వారికి ఈ కేటగిరీ కేటాయిస్తారు. వీళ్లను ఎఫ్ 51 నుంచి ఎఫ్ 53 వరకు కేటాయిస్తారు. ఎక్కువ వైకల్యం ఉంటే ఐదు పక్కన తక్కువ నెంబర్ ఉంటుంది. ఈ లెక్కన ఎఫ్ 51 ఎక్కువ వైకల్యం.. ఎఫ్53 తక్కువ వైకల్యాన్ని సూచిస్తుంది. సాధారణంగా వీళ్లకు నడుము కింది భాగం పని చేయదు. వెన్నెముకకు సంబంధించిన ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే వైకల్యం వచ్చిన వారిని ఈ కేటగిరీలో పారా అథ్లెట్లుగా గుర్తిస్తారు. అయితే వినోద్ కుమార్ కండరాల వైకల్యం గతంలో అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉన్నదని తాజాగా నిర్వాహకులు తేల్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.