Babar Azam: టీ20 క్రికెట్‌లో బాబర్ అజమ్ రికార్డు.. ఆ ఇద్దరి స్టార్ క్రికెటర్లను వెనక్కు నెట్టిన పాకిస్తాన్ కెప్టెన్‌

పొట్టి ఫార్మాట్‌లో బాబర్ అజమ్ అరుదైన రికార్డు.. (PC: PCB)

Babar Azam : టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ అరుదైన రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 7వేల పరుగుల మైలు రాయిని దాటాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 7వేల పరుగులు దాటిన బ్యాటర్‌గా అజమ్ నిలిచాడు.

 • Share this:
  టీ20 క్రికెట్‌లో (T20 Cricket) పాకిస్తాన్ జట్టు (Pakistan Cricket Team) కెప్టెన్ బాబర్ అజమ్ (Babar Azam) అరుదైన రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 7 వేల పరుగుల మైలు రాయిని దాటిన బ్యాటర్‌గా బాబర్ అజమ్ నిలిచాడు. బాబర్ ప్రస్తుతం పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. నేషనల్ టీ20 టోర్నీలో భాగంగా సెంట్రల్ పంజాబ్, దక్షిణ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సెంట్రప్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన అజమ్ 49 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు టీ20 ఫార్మాట్‌లో 7వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. బాబర్ తన ఇన్నింగ్స్‌లో 25 పరుగుల మార్కు వద్ద స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), క్రిస్ గేల్‌ను (Chris Gayle) వెనక్కు నెట్టేశాడు. బాబర్ 187 ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 7వేల పరుగుల మార్కును అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. అయితే క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలో, విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకొని బాబర్ వెనుక నిలిచారు.

  బాబర్ అజమ్ తన కెరీర్‌లో 196 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 187 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 6 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. బాబర్ అత్యధిక స్కోర్ 122 పరుగులు. బాబర్ అజమ్ పాకిస్తాన్ తరపున 61 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 47 సగటుతో 2204 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో బాబర్ ఒక సెంచరీతో పాటు 20 అర్దసెంచరీలు కూడా ఉన్నాయి. బాబర్ టీ20లతో పాటు టెస్టు, వన్డేల్లో కూడా సెంచరీలు చేసి మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రిస్ గేల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టినా.. విరాట్ కోహ్లీకి ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సెంచరీ లేదు.

  IPL 2021: ఆ థర్డ్ అంపైర్‌ను పీకేయండి.. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ

  ఇక టీ20 ఫార్మాట్‌లో 10వేలకు పైగా పరుగులను కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే పూర్తి చేసుకున్నారు. క్రిస్ గేల్, కిరాన్ పొలార్డ్, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, డేవిడ్ వార్నర్‌తో పాటు కోహ్లీ ఈ జాబితాలో ఉన్నారు. అయితే పాకిస్తాన్ నుంచి 7 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ల జాబితాలో బాబర్ అజమ్‌తో పాటు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ ఉన్నారు. టీమ్ ఇండియాలో కోహ్లీతో పాటు సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ 7వేల పరుగుల మైలు రాయిని దాటారు.
  Published by:John Naveen Kora
  First published: