Asia Cup 2022 Final - Pakistan vs Sri Lanka : ఆసియా కప్ (Asia Cup) 2022 ఫైనల్లో టాస్ నెగ్గిన పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ (Dubai) వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న ఆసియా కప్ ఫైనల్లో కీలకమైన టాస్ ను బాబర్ ఆజమ్ నెగ్గాడు. మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ రెండు మార్పులు చేసింది. హసన్ అలీ, ఉస్మాన్ లను పక్కకు పెట్టి వారి స్థానాల్లో నసీం షా, షాదబ్ ఖాన్ లను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఎటువంటి మార్పులను చేయలేదు. గత మ్యాచ్ లో బరిలోకి దిగిన టీంతోనే బరిలోకి దిగనుంది.
ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలో బరిలోకి దిగిన శ్రీలంక తొలి మ్యాచ్ లో ఓడినా.. అనంతరం పుంజుకుని వరుసగా విజయాలు సాధించింది. సూపర్ 4లో అపజయమే లేకుండా ఫైనల్ కు చేరింది. మరోవైపు పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడినా.. హాంకాంగ్ పై నెగ్గి సూపర్ 4కు చేరుకుంది. ఇక సూపర్ 4లో భారత్ తో మరోసారి జరిగిన పోరులో నెగ్గింది. ఆ తర్వాత కిందా మీదా పడుతూ అఫ్గానిస్తాన్ పై వికెట్ తేడాతో నెగ్గి ఫైనల్ బెర్త్ ను సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ లో శ్రీలంక నెగ్గడం విశేషం. అయితే ఆ మ్యాచ్ లో శ్రీలంక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ, ఇక్కడ మాత్రం పాకిస్తాన్ టాస్ నెగ్గడంతో రిజల్ట్ పాక్ కే ఫేవర్ గా వచ్చేలా కనిపిస్తోంది. శ్రీలంక ఓడిన ఒక్క మ్యాచ్ లోనూ టాస్ ఓడిపోయింది.
టాస్ కీలకం
దుబాయ్ లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే దాదాపుగా గెలుస్తూ వస్తోంది. దాంతో మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. ఇప్పటి వరకు ఆసియా కప్ 14 సార్లు జరిగితే అందులో శ్రీలంక 5 సార్లు నెగ్గింది. పాకిస్తాన్ 2 సార్లు గెలిచింది. అత్యధికంగా భారత్ 7 సార్లు నెగ్గింది.
ముఖాముఖి
టి20ల్లో ఇరుజట్లు ఇప్పటి వరకు 22 సార్లు తలపడ్డాయి. అందులో పాకిస్తాన్ 13 సార్లు నెగ్గితే.. శ్రీలంక 9 సార్లు గెలిచింది. చివరి సారిగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 5 వికెట్లతో నెగ్గింది.
తుది జట్లు (అంచనా)
శ్రీలంక
షనక (కెప్టెన్), నిసాంక, కుశాల్, గుణతిలక, ధనంజయ, కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, మదుషాన్
పాకిస్తాన్
బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్, షాదాబ్, ఖుష్దిల్, నవాజ్, అసిఫ్ అలీ, రావూఫ్, హస్నైన్, నసీం షా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, Babar Azam, Pakistan, Sri Lanka