హోమ్ /వార్తలు /క్రీడలు /

PAK vs NZ: తొలి వన్డేకు ముందు పాక్‌కు ఊహించని షాక్.. టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

PAK vs NZ: తొలి వన్డేకు ముందు పాక్‌కు ఊహించని షాక్.. టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

పాకిస్తాన్, న్యూజిలాండ్ కెప్టెన్లు (Image:Twitter)

పాకిస్తాన్, న్యూజిలాండ్ కెప్టెన్లు (Image:Twitter)

PAK vs NZ: న్యూజిలాండ్‌ పర్యటన కొనసాగించడం కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూజిలాండ్‌ ప్రధాని జసిందాతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. సిరీస్‌ను కొనసాగించేందుకు ఆమె ఒప్పుకోలేదు.

  పాకిస్తాన్ క్రికెట్‌‌కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ పర్యటనను కివీస్ జట్టు ఉన్నపళంగా రద్దు చేసుకుంది. న్యూజిలాండ్ అనూహ్య నిర్ణయంతో కోలుకోలేదని దెబ్బ పడింది. పాకిస్తాన్‌ పర్యటనలో న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శుక్రవారమే తొలి వన్డే జరగాలి. కానీ మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు ముందు కివీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్‌ కోసం స్టేడియాన్ని సిద్ధం చేశారు. స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మంది ప్రేక్షకులను కూడా అనుమతించాలని నిర్ణయించారు. కానీ మ్యాచ్‌ ఆరంభ సమయమైనా రెండు జట్లు హోటల్‌ గదుల్లోనే ఉండిపోయాయి. ఎవరూ బయటకు రాలేదు. మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అసలేం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. అంతలోనే న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ వైట్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రత కారణాలతో పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

  ‘‘జట్టు భద్రతకు ముప్పు పెరిగిందని న్యూజిలాండ్‌ ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు పాకిస్తాన్‌లో ఉన్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ భద్రత అధికారులు కూడా పర్యటనను రద్దు చేయాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు పర్యటనను కొనసాగించరాదని నిర్ణయించాం. పీసీబీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. మాకు గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఆటగాళ్ల భద్రతకే మా మొదటి ప్రాధాన్యత. ఈ పరిస్థితుల్లో పర్యటనను రద్దు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు’’ డేవిడ్ వైట్ పేర్కొన్నారు.

  Rohit Sharma: టీ20 తదుపరి కెప్టెన్​గా రోహిత్ శర్మ?.. రోహిత్​కు కలిసొచ్చే అంశాలివే

  పాకిస్తాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ జట్లను రప్పించేందుకు నానా పాట్లు పడుతోంది. ఇప్పుడిప్పుడే పలు దేశాలు పాక్‌లో పర్యటించేందుకు వస్తున్నాయి. కానీ న్యూజిలాండ్ టీమ్.. మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు అనూహ్యంగా టూర్‌ను రద్దు చేసుకోవడం సంచలనంగా మారింది. న్యూజిలాండ్‌ పర్యటన కొనసాగించడం కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూజిలాండ్‌ ప్రధాని జసిందాతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. సిరీస్‌ను కొనసాగించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

  T-20 World Cup : టీ -20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, గ్రూప్‌ల వివరాలు మీ కోసం

  న్యూజిలాండ్‌ క్రికెట్‌ తీరుపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పర్యాటక జట్ల కోసం పీసీబీ, పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తాయని.. న్యూజిలాండ్‌ క్రికెర్లకూ అలాంటి భద్రతనే కల్పిస్తామని తాము హామీ ఇచ్చామని పేర్కొంది. స్వయంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. న్యూజిలాండ్‌ ప్రధానితో మాట్లాడారని.. పర్యటక జట్టుకు ఎలాంటి భద్రత ముప్పు లేదని చెప్పినా వినలేదని వాపోయింది. చివరి క్షణాల్లో న్యూజిలాండ్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించిందని తెలిపింది. న్యూజిలాండ్‌ బోర్డుది ఏకపక్ష తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని విమర్శించింది పీసీబీ. భద్రతా కారణాలు చెప్పి పాక్ పర్యటన నుంచి న్యూజిలాండ్‌ తప్పుకోవడం అసహనం కలిగిస్తోందని పీసీబీ కొత్త ఛైర్మన్‌ రమీజ్‌ రాజా సైతం ధ్వజమెత్తారు. అటు పాకిస్తాన్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం కివీస్ తీరు పట్ల మండిపడ్డారు.

  కాగా, 2009లో లాహోర్‌లో గదాఫీ స్టేడియానికి వెళ్లుండగా శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటన తర్వాత అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్‌కు వెళ్లలేందుకు భయపడ్డాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ క్రికెట్‌కు పూర్వ వైభవం వచ్చింది. 2017లో పాకిస్థాన్‌లో పీఎస్‌ఎల్‌ ఫైనల్‌ నిర్వహించిన తర్వాత... శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా జట్లు పర్యటించాయి. 2019లో పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్‌ ఆడింది. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాము ఆతిథ్యమిచ్చే మ్యాచ్‌లన్నింటినీ యూఏఈకి బదులు స్వదేశంలోనే నిర్వహించాలని అనుకుంది. అందులో భాగంగానే న్యూజిలాండ్‌‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఒప్పందం జరిగింది. కానీ అంతలోనే కివీస్ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో.. పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. కివీస్ నిర్ణయం నేపథ్యంలో ఇంగ్లండ్ ఆలోచనలో పడింది. పాకిస్తాన్ టూర్‌పై 48 గంటల్లో క్లారిటీ ఇస్తామని ప్రకటించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, New Zealand, Pakistan, Sports

  ఉత్తమ కథలు