PAK vs ENG 1st Test : మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో పర్యాటక ఇంగ్లండ్ (England) అద్భుత ప్రదర్శన చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో అంతిమంగా ఇంగ్లండ్ విజయం సాధించింది. రావల్పిండి వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల ఆట పూర్తయ్యాక ఇరు జట్లు కూడా సమంగా నిలిచాయి. ఒక దశలో గెలుపు అవకాశాలు ఇరుజట్లకు సమానంగా ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు అవసరం కాగా.. పాక్ గెలవాలంటే 223 పరుగులు చేయాల్సి ఉంది.
343 పరుగుల లక్ష్యంతో.. ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకు 80 పరుగులతో చివరిదైన ఐదో రోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్ 96.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు. పాకిస్తాన్ తరఫున సౌద్ షకీల్ (76; 12 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒక దశలో పాకిస్తాన్ 5 వికెట్లకు 259 పరుగులతో ఉంది. విజయం సాధించాలంటే 84 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ చివరి ఐదు వికెట్లను కేవలం 9 పరుగుల వ్యవధిలో కోల్పోయి ఓడిపోయింది.
ఇక ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 101 ఓవర్లకు 657 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. హ్యారీ బ్రూక్ (153), జాక్ క్రాలీ (122), పోప్ (108), బెన్ డకెట్ (107) సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును అందుకుంది. ఇక పాకిస్తాన్ కూడా ఇంగ్లండ్ కు తగిన జవాబే ఇచ్చింది. పాక్ తన తొలి ఇన్నింగ్స్ లో 155.3 ఓవర్లలో 579 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (136), అబ్దుల్లా షఫీక్ (114) సెంచరీలు చేశారు. 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ 7 వికెట్లకు 264 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో పాకిస్తాన్ ముందు 343 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది.
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో అబ్దుల్లా షఫీక్ (6) వికెట్ ను త్వరగానే కోల్పోయింది. అయితే ఇమాముల్ హక్ (48), అజార్ అలీ (40) జట్టును ఆదుకున్నారు. నాలుగో రోజు ఆటను 2 వికెట్లకు 80 పరుగుల వద్ద ముగించింది. అయితే చివరి రోజు మాత్రం ఆఖర్లో వికెట్లను వరుసగా కోల్పోయి ఓటమి పక్షాన నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, England, Pakistan