Shahid Afridi: తన కూతురుపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఖండించాడు. అలాంటిదేం జరగలేదని, ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయాడనికి సిగ్గుండాలని మండిపడ్డాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది..?
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) 2020 సీజన్ నుంచి షాహిద్ అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత ఎమర్జన్సీ కారణంగానే తాను ఎల్పీఎల్ వీడుతున్నానని అఫ్రిది తెలిపాడు. అలాగే పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్లీ వస్తానన్నాడు. 'దురదృష్టవశాత్తు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్తున్నాను. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మళ్లీ వస్తాను. ఆల్ ద బెస్ట్'అని ట్వీట్ చేశాడు. ఇక లంక ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విటర్ పేజీలో అఫ్రిది లీగ్ వీడటానికి గల కారణమేంటో తెలియజేశారు. అతని కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఫొటోతో సహా ట్వీట్ చేశారు.
అయితే అఫ్రిది మాత్రం అలాంటిదేం లేదని,తన కూతురు అసలు అనారోగ్యానికే గురవ్వలేదన్నాడు. జియో టీవీతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహారించాలన్నాడు. అలాంటి వారికి సిగ్గుండాలని మండిపడ్డాడు. అలాగే ఆదివారం తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తన కూతురితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. 'నా ముద్దుల కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ అల్లా దయతో మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాం'అని ట్వీట్ చేశాడు.
అఫ్రిది ఆకస్మాత్తుగా లీగ్‌ను వీడటంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న గాల్లే గ్లాడియేటర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 40 ఏళ్ల అఫ్రిది పాక్ తరఫున 398 వన్డేలు, 99 టీ20ల్లో 8064, 1416 పరుగులు చేశాడు.