Rashid Khan :" దేశం కోసం కొంత సమయం కేటాయిద్దాం" .. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రషీద్ ఖాన్ ఆవేదన

Rashid Khan

Rashid Khan : అప్గానిస్తాన్‌లో (Afghanistan) ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని (Democracy) కూలదోసి తాలిబాన్లు (Talibans) ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఇక, అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.

 • Share this:
  అప్గానిస్తాన్‌లో (Afghanistan) ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని (Democracy) కూలదోసి తాలిబాన్లు (Talibans) ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఇక, అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అఫ్గానిస్థాన్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కాల్పులు, తొక్కిసలాట కారణంగా పలువురు మృతిచెందినట్లు సమాచారం.అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ చూసి ఆ దేశ స్టార్ క్రికెటర్ ర‌షీద్ ఖాన్‌ (Rashid Khan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. " ఈరోజు అఫ్గానిస్థాన్‌ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయం కేటాయిద్దాం. ఆ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోము. శాంతియుత, అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాము" అని ర‌షీద్ ఖాన్‌ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ చలిస్తున్నారు.

  తాలిబాన్లు మళ్లీ విద్రోహ చర్యలకు తెగబడుతుండటంతో అఫ్గాన్‌ ప్రజల్లో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కాబుల్‌లో చాలామంది ఇళ్ల నుంచి అడుగు కూడా బయటపెట్టలేదు. మరికొందరు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్ల భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. ఈ క్రమంలోనే వారు ఐపీఎల్‌ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆడ‌తారో లేదో అన్న సందిగ్ధం నెల‌కొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం క్లారిటీ ఇచ్చింది. " ప్ర‌స్తుతం అక్క‌డ ఏం జ‌రుగుతున్న‌దానిపై మేము మాట్లాడ‌లేం. కానీ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు" అని సన్‌రైజర్స్ టీమ్ సీఈవో ష‌ణ్ముగం స్ప‌ష్టం చేశారు. ఈ నెల 31న త‌మ టీమ్ యూఏఈకి బ‌య‌లుదేరుతోంద‌ని ఆయన వెల్ల‌డించారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.


  ఇక, అఫ్గానిస్తాన్‌లో అత్యధిక ట్యాక్స్ పేయర్లలో క్రికెటర్లు ముందు వరుసలో ఉన్నారు. దేశం తరపునే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రికెట్ లీగ్స్‌లో పాల్గొంటున్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఇద్దరూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నారు. ఆఫ్గానిస్తాన్‌లో కనీసం క్రికెట్ ప్రాక్టీస్ చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో వీళ్లు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలలో ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతే కాకుండా బీసీసీఐ వీళ్ల కోసం డెహ్రాడూన్ స్టేడియంను ఇచ్చింది. ఇతర దేశాలతో సిరీస్‌లను ఆఫ్గాన్ జట్టు ఇండియాలోనే ఆడుతుంటుంది.
  Published by:Sridhar Reddy
  First published: