హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : హెచ్‌సీఏ సమావేశం రసాభాస.. అజారుద్దీన్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కార్యదర్శి

Cricket : హెచ్‌సీఏ సమావేశం రసాభాస.. అజారుద్దీన్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కార్యదర్శి

హెచ్‌సీఏ ఏజీఎం రసాభసగా ముగిసింది. అంబుబ్స్‌మన్ నియామకంపై సభ్యుల మధ్య విభేదాలు [PC: Twitter}

హెచ్‌సీఏ ఏజీఎం రసాభసగా ముగిసింది. అంబుబ్స్‌మన్ నియామకంపై సభ్యుల మధ్య విభేదాలు [PC: Twitter}

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) రసాభసగా మారింది. గత కొన్నాళ్లుగా హెచ్‌సీఏలో అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azaruddin), కార్యదర్శి విజయానంద్ (Vijayanand) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మార్చి 28న నిర్వహించిన ఏజీఎం అర్దాంతరంగా ముగియడంతో దాన్ని తిరిగి ఆదివారం కొనసాగించారు. హెచ్‌సీఏలోని 184 మంది సభ్యులు ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఇందులో అసోసియేషన్ అంబుడ్స్‌మన్‌గా (Ombudsman) దీపక్ వర్మను (Deepak Varma) నియమించడమే ముఖ్య ఎజెండా. గత ఏడాది అధ్యక్షుడు అజారుద్దీన్ అంబుడ్స్‌మెన్‌గా దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం చెల్లదని కార్యదర్శి విజయానంద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో విజయానంద్‌కు చుక్కెదురైంది. కోర్టు ఆయనకు రూ. 25వేలు జరిమానా కూడా విధించింది. గతంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, జాయింట్ సెక్రెటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ అంబుడ్స్‌మన్ నియామకాన్ని సమర్థించారు. తాజాగా జరిగిన ఏజీఎంలో వీరందరూ అతడి నియామకాన్ని వ్యతిరేకించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక మీదే ఉన్న విజయానంద్ సహా మిగతా కార్యవర్గం రాజీనామా చేయాలని సభ్యులు పెద్దఎత్తున డిమాండ్ చేయడంతో అక్కడ గొడవ మొదలైంది. అయితే అధ్యక్షుడు అజారుద్దీన్ సభ్యులను శాంతింప చేశారు. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని ఆయన కోరడంతో 184 మంది సభ్యుల్లో మెజార్టీ వర్గం ఇందుకు సానుకూలంగా స్పందించింది. దీంతో అంబుడ్స్‌మెన్‌గా దీపక్ వర్మ నియామకం పూర్తయింది.

దీపక్ వర్మ నియామకం పూర్తయినట్లు అజారుద్దీన్ ప్రకటిస్తుండగానే విజయానంద్ వేదికపైనే గలాటా సృష్టించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోకపోతే తాను అజారుద్దీన్ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావిడి చేశారు. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొన్నది. కార్యదర్శి విజయానంద్ తీవ్ర బెదిరింపులకు పాల్పడినా.. అజారుద్దీన్ ఇవేమీ పట్టించుకోలేదు. అయితే ఇక్కడే మరో వివాదం చోటు చేసుకున్నది. ఏజీఎం ముగిసిన తర్వాత అధ్యక్షుడు అజారుద్దీన్ సహా సభ్యులందరూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. కానీ అపెక్స్ కమిటీ సభ్యులు మరోసారి వేదికపైనే సమావేశమై అజారుద్దీన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. కొంత మంది అపెక్స్ కమిటీ సబ్యులు జస్టీస్ నిసార అహ్మద్ కక్రూను కొత్త అంబుడ్స్‌మెన్‌గా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న అజారుద్దీన్ సహా మిగతా సభ్యులు వ్యతిరేకించారు. ఏజీఎంలో ఒకరి నియామకం అయిపోయిన తర్వాత కొత్త నియామకం చెల్లదని చెప్పారు. గత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేవలం అంబుడ్స్‌మన్ వ్యవహారం గురించి చర్చ మాత్రమే జరిగిందని.. ఎవరినీ నియమించలేదని విజయానంద్ అన్నారు. ఇప్పుడు మాత్రం కక్రూనే అంబుడ్స్‌మెన్ అని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అంటున్నారు.


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అధ్యక్షుడు అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యులకు చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి. హెచ్‌సీఏలో క్రికెటర్లకు అన్యాయం జరుగుతున్నదని.. అనామకులను టోర్నీలకు పంపుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీకి హెచ్‌సీఏ సభ్యుల కుటుంబాలకు చెందిన కొంత మంది క్రికెటర్లను పంపారని.. అసలైన క్రికెటర్లకు అవకాశాలు రావడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ఇరు వర్గాలు బాహాటంగానే విమర్శలు చేసుకున్నాయి. అంతే కాకుండా హెచ్‌సీఏలో జరుగుతున్న విషయాలను ఒక వర్గం బీసీసీఐ కార్యదర్శి జై షా దృష్టికి కూడా తీసుకొని వెళ్లారు. తాజా వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

First published:

Tags: Azaruddin, Bcci, Cricket

ఉత్తమ కథలు