హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ రద్దు? జపాన్ ప్రభుత్వం నుంచి సంకేతాలు.!

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ రద్దు? జపాన్ ప్రభుత్వం నుంచి సంకేతాలు.!

టోక్యో ఒలంపిక్స్ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఈ సారి రద్దయ్యే అవకాశాలే ఎక్కువ

టోక్యో ఒలంపిక్స్ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఈ సారి రద్దయ్యే అవకాశాలే ఎక్కువ

కరోనా మహమ్మారి క్రీడలను వదలడం లేదు. ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఒలింపిక్స్‌పై పడింది. జపాన్‌లో పరిస్థితి కూడా తీవ్రంగా ఉండటంతో ఈ క్రీడలు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

క్యాష్ రిచ్ మెగా లీగ్ ఐపీఎల్‌ను కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్‌ను (Olympics) ఈ సారి రద్దు చేసే సూచనలు కనపడుతున్నాయి. గత ఏడాది జులై 22న ప్రారంభం కావల్సిన ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులై 23 నుంచి అగస్టు 8 వరకు ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం జపాన్‌ (Japan) కరోనా సెకెండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్నది. దీంతో టోక్యో (Tokyo) సహా ప్రధాన నగరాల్లో విధించిన ఎమర్జెన్సీని పొడిగించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో గత నెలలోనే ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు టోక్యో, ఒసాక, క్యోటో, హ్యూగో నగరాల్లో మే 11 వరకు ఎమర్జెన్సీని పొడిగించారు. అయితే వారం తర్వాత కూడా కరోనా కేసులు తగ్గక పోతే మరిన్ని రోజులు ఎమర్జెన్సీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు జపాన్ ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం ఒలింపిక్స్‌పై కూడా పడే అవకాశం ఉంటుందని.. చివరకు రద్దు చేయాల్సి వస్తుందేమో అని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో టోక్యో ఒలంపిక్ కమిటీ ఇప్పటికే విదేశీ ప్రేక్షకుల అనుమతిపై నిషేధం విధించింది. రేపో మాపో స్వదేశీ ప్రేక్షకులను కూడా అనుమతించకుండా ఖాళీ స్టేడియంలలో క్రీడలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అప్పటికీ క్రీడల నిర్వహణ కష్టతరం అయితే రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. గత ఏడాది వాయిదా వేసే సమయంలోనే.. ఒక వేళ అప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోతే క్రీడలను రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈ క్రీడలు 2021లో జరుగుతున్నా ఇప్పటికీ టోక్యో ఒలంపిక్స్ 2020 అనే పిలుస్తున్నారు. క్రీడలకు మరో 10 వారాల సమయం ఉన్నందున.. జపాన్ ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, టోక్యో ఒలంపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీలతో జపాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నది.


గత కొన్ని రోజులుగా ఆసియా ఖండంలోనే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒలింపిక్స్ అర్హత టోర్నీలకు కూడా కరోనా బెడత తప్పడం లేదు. ఇటీవల భారత రెజ్లింగ్ టీమ్ అర్హత పోటీలకు వెళ్లి కరోనా బారిన పడటంతో మ్యాచ్‌లు ఆడకుండానే వెనక్కు వచ్చారు. చాలా ఈవెంట్లలో అర్హత పోటీలను గత ఏడాది వాయిదా వేసి ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇన్ని అవాంతరాల నడుమ ఒలింపిక్స్ సక్రమంగా జరుగుతాయా అనే అనుమానాలు నెలకొన్నాయి.

First published:

Tags: Covid-19, Olympics, Tokyo, Tokyo Olympics

ఉత్తమ కథలు