హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics : ఒలింపిక్స్‌లో పతకం అందుకోవాలంటే చాలా ఆంక్షలు.. ఇలా కచ్చితంగా చేయాల్సిందే

Olympics : ఒలింపిక్స్‌లో పతకం అందుకోవాలంటే చాలా ఆంక్షలు.. ఇలా కచ్చితంగా చేయాల్సిందే

ఒలింపిక్స్‌లో విజేతలు ఈ నియమాలు పాటించాల్సిందే..!

ఒలింపిక్స్‌లో విజేతలు ఈ నియమాలు పాటించాల్సిందే..!

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన ఆనందంలో గుంపులుగా నిలబడి ఫొటోలు దిగడానికి వీలు లేదు. పతకం అందుకునే సమయంలో కూడా ఫొటోలు దిగరాదు. ఇలా ఎన్నో నిబంధనలు ఐవోసీ గురువారం వెల్లడించింది.

  టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అథ్లెట్లు (Athletes) పాటించాల్సిన కరోనా నిబంధనలను (Corona Rules) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  (International Olympic Committee) గురువారం విడుదల చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ అథ్లెట్ ఈ మార్గదర్శకాలను పాటించాలని.. కరోనా వైరస్ కట్టడి కోసమే వీటిని రూపొందించినట్లు ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లు పతకాలు తీసుకునే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని ఆ నిబంధనలో పేర్కొన్నారు. అంతే కాకుండా పతకాలు అందుకునేందుకు పోడియం వద్దకు వచ్చిన సమయంలో స్వర్ణ, రజతం, కాంస్య పతకాల విజేతలు తప్పకుండా దూరం పాటించాలని తెలిపారు. ఇక పతకాలు ఇచ్చే వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రతీ ఈవెంట్ వద్ద ఒక ఐవోసీ సభ్యుడితో పాటు అంతర్జాతీయ ఫెడరేషన్ ప్రతినిధి మాత్రమే ఉంటారని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. ఇక అథ్లెట్లు అందరూ తప్పని సరిగా టీకాలు వేయించుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

  ఇక పతకాల ప్రధానోత్సవంలో విజేతలు, పతకాలు అందించే వాళ్లు గ్రూప్ ఫొటోలు దిగవద్దని.. వారితో వలంటీర్లు ఫొటోలు తీసుకోకూడదని ఐవోసీ నిబంధనల్లో పేర్కొన్నారు. పోడియం వద్ద పతకాలు అందజేసే సమయంలో మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నందు వల్లనే ఈ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించినట్లు ఐవోసీ పేర్కొన్నది. టోక్యోకు వచ్చే ప్రతీ అథ్లెట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మార్పులు చేసి.. ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు థామస్ బాచ్ తెలిపారు. ప్రారంభ వేడుకకు ముందు నుంచే ప్రతీ అథ్లెట్ కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.


  జులై 23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ 2020కి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరితో పాటు దాదాపు 60 వేల మంది వలంటీర్లు కూడా హాజరు కానున్నారు. అథ్లెట్లు, కోచింగ్ స్టాఫ్ కోసం క్రీడా గ్రామంలో బస ఏర్పాటు చేశారు. అక్కడే పెద్ద భోజన శాల, బ్యాంకు, పోస్టాఫీసు కూడా ఏర్పాటు చేశారు. టోక్యోలో అడుగు పెట్టిన తర్వాత అందరినీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే అథ్లెట్లను క్రీడా గ్రామంలోనికి అనుమతిస్తారు. ప్రతీ అథ్లెట్ రోజు తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. ఆ రోజు ఆట ఆడాలంటే ఉదయాన్నే పరీక్షలో నెగెటివ్ ఫలితం వస్తేనే వారిని ఆటకు అనుమతిస్తారని నిబంధనలు రూపొందించారు. ఇవన్నీ కరోనా కట్టడి కోసమే అని నిర్వాహక కమిటీ ఇప్పటికే వెల్లడించింది.

  Published by:John Kora
  First published:

  Tags: Olympics, Tokyo, Tokyo Olympics

  ఉత్తమ కథలు