నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒలింపిక్స్‌లో (Olympics 2020) పాల్గొనడం ప్రతీ అథ్లెట్ కల. ఇక ఆ విశ్వ క్రీడల్లో పతకం (Medal) సాధించడం అంటే దేశానికే గర్వకారణం. కేవలం మన దేశమే కాదు.. ప్రపంచంలోని ప్రతీ దేశంలో ఉన్న క్రీడాకారుడు పతకం కోసమే ఒలింపిక్స్ ఆడుతుంటారు. తమ క్రీడాకారుడు పతకం గెలిచి తమ దేశ ప్రతిష్టను పెంచినందుకు ఆయా ప్రభుత్వాలు నజరానాలు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో (IOA) పాటు ఒడిషా, కర్ణాటక, యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) పతకాలు సాధించే అథ్లెట్లకు కోట్లు రూపాయలు బహుమతిగా ప్రకటించాయి. ఇలాంటి ప్రోత్సాహక నగదు బహుమతులు కేవలం మన దేశానికి చెందిన ప్రభుత్వాలే కాదు.. ఇతర దేశాలు కూడా ప్రకటించాయి. తమ దేశానికి ప్రతిష్టను తీసుకొని వచ్చే అథ్లెట్లకు కోట్లాది రూపాయల నగదు బహుమతులు ప్రకటించాయి. అమెరికా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఒక చట్టం ప్రకారం నగదు బహుమతిని అందిస్తున్నారు. కానీ మిగిలిన దేశాలు తమకు తోచినంత బహుమతిని ఇచ్చేస్తున్నాయి. ఒడిషా రాష్ట్రం స్వర్ణ పతకం గెలిచే వారికి రూ. 6 కోట్ల నగదును ప్రకటించింది.
ఇండియా నుంచి 127 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లారు. వారిలో పతకాలు తెచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందిస్తామని ప్రకటించింది. స్వర్ణ పతకానికి రూ. 75 లక్షలు, రజత పతకానికి రూ. 50 లక్షలు, కాంస్య పతకానికి రూ. 30 లక్షలను నగదు బహుమతిగా ప్రకటించింది. ఇక హర్యాణా, ఉత్తరప్రదేశ్, చత్తీస్ఘడ్, ఒడిషా, చండీఘర్ స్వర్ణం తెస్తే రూ. 6 కోట్లు, రజతానికి రూ. 4 కోట్లు, కాంస్యానికి రూ. 2.5 కోట్లు నగదు పురస్కారాన్ని అందించనున్నాయి. కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు స్వర్ణ పతక విజేతలకు రూ. 5 కోట్లు ఇవ్వనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి చెందిన అథ్లెట్‌కి అయినా బంగారు పతకానికి రూ. 3కోట్లు ఇస్తామని ప్రకటించింది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే పతకాలు తెచ్చే వారికి అత్యధిక మొత్తం మనే దేశంలోనే లభించనున్నది.
ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ పతకాలు తెచ్చే వారికి రూ. 34 లక్షల బహుమతి ఇవ్వనున్నది. బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం తమ అథ్లెట్లకు రూపాయి కూడా బహుమతిగా ఇవ్వబోవవడం లేదు. దానికి బదులుగా ప్రతీ ఏడా 160 మిలియన్ డాలర్లను ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ శిక్షణ కోసం కేటాయిస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం ఈ విషయంలో కచ్చితంగా ఉంటుంది. తమ అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటించడం ద్వారా వారిలో క్రీడా స్పూర్తి రాదని.. తమలో ఉన్న ప్రతిభను అందరికీ చూపాలనే తపన ఉండాలని కోరుకుంటుంది. కానీ, క్రీడా శిక్షణకు మాత్రం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది.
ఏ దేశం ఎంత ఇస్తున్నది?
ఇండోనేషియా - రూ. 5.55 కోట్లు
సింగపూర్ - రూ. 5.47 కోట్లు
హాంకాంగ్ - రూ. 4.80 కోట్లు
థాయ్‌లాండ్ - రూ. 2.30 కోట్లు
కజికిస్తాన్ - రూ. 1.86 కోట్లు
ఇటలీ - రూ. 1.58 కోట్లు
అమెరికా - రూ. 28 లక్షలు
ఫ్రాన్స్ - రూ. 48 లక్షలు
రష్యా - రూ. 45 లక్షలు
బ్రెజిల్ - రూ. 35 లక్షలు
దక్షిణ ఆఫ్రికా - రూ. 27.5 లక్షలు
నెదర్లాండ్స్ - రూ. 26 లక్షలు
జర్మనీ - రూ. 16 లక్షలు
కెనడా - రూ. 12 లక్షలు
ఆస్ట్రేలియా - రూ. 11 లక్షలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics