Home /News /sports /

Tokyo Olympics: తీరని నోవాక్ జకోవిచ్ కల.. వరల్డ్ నెంబర్ 1ను ఓడించిన పాబ్లో బుస్టా.. మెడల్ లేకుండానే ఇంటికి..

Tokyo Olympics: తీరని నోవాక్ జకోవిచ్ కల.. వరల్డ్ నెంబర్ 1ను ఓడించిన పాబ్లో బుస్టా.. మెడల్ లేకుండానే ఇంటికి..

టోక్యో ఒలింపిక్స్‌లో తీరని జకోవిచ్ కల.. వరల్డ్ నెంబర్ వన్‌కు ఝలక్ (PC: Olympics)

టోక్యో ఒలింపిక్స్‌లో తీరని జకోవిచ్ కల.. వరల్డ్ నెంబర్ వన్‌కు ఝలక్ (PC: Olympics)

వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ టోక్యో ఒలింపిక్స్ ప్రయాణం ముగించాడు. గోల్డెన్ స్లామ్ చేద్దామని అనుకున్న జకోవిచ్.. కనీసం కాంస్య పతకం కూడా సాధించలేకపోయాడు.

    పురుషుల టెన్నిస్‌లో వరల్డ్ నెంబర్ 1 (World No 1) ఆటగాడు, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) ఒలింపిక్స్ (Tokyo Olympics) పతకం కల తీరలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి రికార్డు సృష్టించాలని భావించిన జకోవిచ్‌ను సెమీస్‌లో జ్వెరేవ్ ఓడించాడు. ఇక కాంస్య పతకంతో అయినా సరిపెట్టుకుందామని శనివారం బరిలోకి దిగిన జకోవిచ్‌కు ఇక్కడ చుక్కెదురైంది. స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి నువ్వా నేనా అనేలా తలపడిన జకోవిచ్, బుస్టాల్లో చివరకు బుస్టాదే పై చేయి అయ్యింది. తొలి సెట్‌ను బుస్టా 6-4తో అలవోకగానే నెగ్గాడు. అయితే రెండో సెట్ టై బ్రేకర్‌క వెళ్లింది. అప్పుడు బుస్టాకు మెడల్ పాయింట్ లభించింది. కానీ జకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆ టై బ్రేకర్‌ను గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్ మూడో సెట్‌కు వెళ్లింది. మూడో సెట్‌లో బుస్టా అత్యంత చాకచక్యంగా ఆడి వేగంగా పాయింట్లు సాధించాడు. చివర్లో జకోవిచ్ పోరాడినా బుస్టా ఏ మాత్రం చాన్స్ ఇవ్వలేదు. చివరి సెట్‌ను 6-3తో గెలుచుకొని బుస్టా బ్రాంజ్ మెడల్ ఎగరేసుకొని పోయాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో బుస్టా 6-4, 6-7(6/8), 6-3 తేడాతో గెలిచాడు.

    వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నమెంట్ గెలిచి మొత్తం 20 గ్రాండ్ స్లామ్స్‌తో ఫెదరర్, నదాల్ సరసన నిలిచాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం, యూఎస్ ఓపెన్ కూడా గెలిచి ఇప్పటి వరకు ఎవరూ సాధించని గోల్డెన్ స్లామ్ సాధించాలని కల కన్నాడు. వింబుల్డన్ విజయం తర్వాత తాను గోల్డెన్ స్లామ్ కోసం ప్రయత్నిస్తానని కూడా వ్యాఖ్యానించాడు. సెర్బియా తరపున టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన జకోవిచ్.. సెమీస్ వరకు దూసుకొని వచ్చాడు. కానీ సెర్బియన్ వీరుడికి జ్వరేవ్ బ్రేకులు వేశాడు. కనీసం కాంస్యం అయినా దక్కించుకుంటాడని భావించినా బుస్టా అతడికి చుక్కలు చూపించాడు. కాగా, ఈ ఏడాది చివర్లో జరిగే యూఎస్ ఓపెన్ గెలవడం ద్వారా జకోవిచ్ క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశం ఉన్నది. అలాగే 2024 ప్యారీస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గినా గోల్డెన్ స్లామ్‌గా పిలువబడే అవకాశం ఉన్నది.





    మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా జకోవిచ్/స్టాజానోవిచ్ జోడి ఆస్ట్రేలియన్ జోడీపై ఓడిపోయింది. దీంతో జకోవిచ్ ఒలింపిక్స్ ప్రయాణం ముగిసినట్లైంది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Novak Djokovic, Olympics, Tennis, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు