Home /News /sports /

NOMINATED MLC PADI KAUSHIK REDDI WAS ONCE A RANJI CRICKETER HOW HE MISSED NATIONAL TEAM CHANCE CHECK HERE JNK

Cricket: ఎమ్మెల్సీ కాబోతున్న పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు క్రికెటర్ అనే విషయం తెలుసా? టీమ్ ఇండియా ఛాన్స్ ఇలా పోయింది

కాబోయే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు క్రికెటర్ (Twitter)

కాబోయే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు క్రికెటర్ (Twitter)

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు హైదరాబాద్ రంజీ జట్టులో కీలక సభ్యుడు. అనేక మ్యాచ్‌లు ఆడిన కౌశిక్ జాతీయ జట్టులోకి కూడా రావల్సింది. కానీ అతడు అవకాశాన్ని కోల్పోయాడు.

  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy). మాజీ మంత్ర ఈటెల రాజేందర్ రాజీనామా అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చినప్పుడు ఎక్కువగా కౌశిక్ రెడ్డి పేరు తెరపైన వినిపించింది. కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో అదే నియోగకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి.. ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడమూ.. వెంటనే అతడికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం చకచకా జరిగిపోయింది. ప్రస్తుతం ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయిన కౌశిక్ రెడ్డి ఒకప్పుడు క్రికెటర్ అనే విషయం చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రంజీ జట్టుకు (Hyderabad Ranji Team) ఆడిన పాడి కౌశిక్ రెడ్డి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీమ్ ఇండియా క్రికెటర్లు అయిన అంబటి రాయుడు, శిఖర్ ధావన్, ప్రజ్టాన్ ఓజ, ఆర్పీ సింగ్‌ సహచరుడిగా ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్ రంజీ జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌గా ఉన్నప్పడు కౌశిక్ రెడ్డి బౌలర్‌గా జట్టులో ఉన్నాడు. 2006లో సౌత్ జోన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగినప్పుడు కౌశిక్ రెడ్డి 5కు పైగా వికెట్లు తీయడమే కాకుండా 40 పరుగులు బాది మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ సౌత్ జోన్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతే కాకుండా ఆ సీజ్ మొత్తం కౌశిక్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. ఆ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తప్పకుండా ఎంపిక అవుతాడని అందరూ భావించారు. కానీ కౌశిక్ స్థానంలో ఆర్పీ సింగ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు.

  జాతీయ జట్టుకు అవకాశం వస్తుందని భావించినా రాకపోవడంతో కౌశిక్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ సమయంలో సెలెక్టర్‌గా ఉన్న శివ్‌లాల్ యాదవ్‌పై మీడియా ముఖంగా దుమ్మెత్తి పోశాడు. తనకు అవకాశాలు రాకుండా కక్ష పూరితంగా అడ్డుకుంటున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో జీ టీవీ ఆధ్వర్యంలో కపిల్ దేవ్ చైర్మన్‌గా ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ హీరోస్ అనే ఫ్రాంచైజీని కూడా స్థాపించారు. ఇందులోకి అప్పటి రంజీ ప్లేయర్లు చాలా మంది జాయిన్ అయ్యారు. అంబటి రాయుడు సహా ఇబ్రహీం ఖలీల్, ఇంద్రశేఖర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, శశాంక్ నాగ్, డి. వినయ్ కుమార్ వంటి క్రికెటర్లు ఐసీఎల్‌లో చేరిపోవడంతో హైదరాబాద్ రంజీ జట్టులో సంక్షోభం వచ్చింది. అయితే 2008లో ఐసీఎల్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి బీసీసీఐ మెగా లీగ్ ఐపీఎల్‌ను ప్రకటించింది. దీంతో రెండు సీజన్లకే ఐసీఎల్ అటకెక్కింది.

  అయితే ఐసీఎల్‌లో ఆడిన ప్లేయర్లను తిరిగి తీసుకోవడానికి బీసీసీఐ నిరాకరించింది. కానీ, పలు సంప్రదింపుల తర్వాత వారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అంబటి రాయుడు కూడా హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చేశాడు. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తిరిగి రావడానికి ఇష్టపడలేదు. అప్పటికే హెచ్‌సీఏలో కీలక సభ్యుడైన శివ్‌లాల్ యాదవ్‌పై విమర్శలు చేసిన కౌశిక్ తిరిగి అతని దగ్గర ఆడటానికి ఇష్టపడలేదు. అంబటి రాయుడు వచ్చినా.. అతడిపై జరుగుతున్న వేదింపులను దగ్గరగా చూసిన కౌశిక్ ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు.

  హైదరాబాద్ రంజీ క్రికెటర్లతో పాడి కౌశిక్ రెడ్డి (మధ్యలో ఎత్తుగా ఉన్న వ్యక్తి) (Pic Credit AFP/ESPNCRICINFO)


  ఒక ఫాస్ట్‌బౌలర్‌కు ఉండాల్సిన మంచి ఎత్తు కలిగి ఉండే కౌశిక్ రెడ్డి.. ఆల్‌రౌండర్‌గా జాతీయ జట్టులో ఆడాల్సిన క్రికెటర్.. చివరకు రాజకీయాల్లో స్థిరపడ్డాడు. 1984 డిసెంబర్ 24న పుట్టిన కౌశిక్ విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. తొలుత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన కౌశిక్... క్రికెట్ కోసం సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌కు మారిపోయాడు. భవన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 47 వికెట్లు తీశాడు. 6/31 అతడి ఉత్తమ ప్రదర్శన. 5 వికెట్లు రెండు సార్లు, 10 వికెట్లు ఒక సారి తీశాడు. మొత్తం 299 పరుగులు చేయగా.. అందులో ఒక అర్ద సెంచరీ ఉన్నది. ఇక 12 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన కౌశిక్ 17 వికెట్లు తీశాడు. 3/36 అతడి ఉత్తమ ప్రదర్శన. 2004 డిసెంబర్ 22న పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌తో రంజీల్లోకి అడుగుపెట్టాడు. చివరిగా 2007 జనవరి 10న పంజాబ్‌పైనే చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఐసీఎల్‌లో హైదరాబాద్ హీరోస్ తరపున రెండు సీజన్లు ఆడాడు.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Bcci, Cricket, IPL

  తదుపరి వార్తలు