కరోనా ప్రభావం తగ్గడంతో క్రికెట్ స్టేడియంలోకి మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు వస్తున్నారు. తమ ఫేవరేట్ ఆటను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్, టీ20, వన్డే సీరిస్ జరుగుతుండటం.. ఆ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోసారి క్రికెట్ మజాను ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని డిసైడయిన ఫ్యాన్స్.. టెస్ట్ మ్యాచ్‌లను చూసేందుకు సైతం స్టేడియాలకు ఎక్కువగా వస్తున్నారు. దీంతో రాబోయే టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకున్నారు. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పుణెలో జరగాల్సిన మూడు వన్డేలు జరుగుతాయా ? లేదా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.
అయితే దీనిపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సీఎం ఉద్ధవ్ థాక్రేను కలవడంతో.. మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ వచ్చింది. స్టేడియంలో వీక్షకులకు అనుమతి లేకుండా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. దీంతో మార్చిలో జరగనున్న మూడు వన్డేలు ఖాళీ స్టేడియంలోనే జరగడం ఖాయమైంది. అయితే అంతకంటే ముందు గుజరాత్ అహ్మదాబాద్‌లో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లకు వీక్షకులను అనుమతించే విషయంలో అక్కడి ప్రభుత్వాలు పునరాలోచన చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం.. క్రికెట్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాయని చెప్పొచ్చు.