భారత మహిళ క్రికెట్ జట్టు చేసిన పొరపాట్లతో గెలిచే మ్యాచ్‌ను ఓడిపోయేలా చేసుకున్నది. చివర బంతి వరకు నరాలు తెగే టెన్షన్‌తో జరగిన మ్యాచ్ చివరి ఓవర్లో గందరగోళం సృష్టించింది. చివరకు ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. మెకాయ్ వేదికగా శుక్రవారం ఇండియా మహిళలు - ఆస్ట్రేలియా మహిళల మధ్య రెండో వన్డే జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టును స్మృతి మంధాన తన అద్బుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ కలసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. మొదటి నుంచి స్మృతి ఎక్కువ బంతులు ఆడుతూ సాధ్యమైనన్ని పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ఉన్న షెఫాలీ వర్మ ఆమెకు చక్కని సహకారం అందించింది. అయితే షెఫాలి వర్మ (22) మోలినెక్స్ బౌలింగ్‌లో అవుటై పెవీలియన్ చేరింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్ (8), యాస్తిక భాటియా (3) నిరాశ పరిచారు.
కానీ క్రీజులో పాతుకొని పోయిన స్మృతి, రిచా ఘోష్‌తో కలసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించింది. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. అయితే తహీలా మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో స్మృతి మంధాన (86) మూనీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. మిడిల్ , లోయర్ ఆర్డరర్లో రీచా ఘోష్ (44), దీప్తి శర్మ (23), పూజా వస్త్రాకర్ (29), జులన్ గోస్వామి (28) పరుగులు రాబట్టడంతో సఫలం అవడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. తహిలా మెక్‌గ్రాత్ 3, సోఫీ మోలినెక్స్ 2 వికెట్లు తీయగా డ్రేసీ బ్రౌన్కు ఒక వికెట్ లభించింది.
భారత జట్టు నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అలీసా హీలీ (0) జులన్ గోస్వామి బౌలింగ్‌లో డకౌట్ అయిు పెవీలియన్ చేరింది. తర్వాత వచ్చిన మెగ్ లాన్నింగ్ (6), ఎలీస్ పెర్రీ (2), ఆష్లీ గార్డెనర్ (12) కూడా విఫలమవడంతో ఆస్ట్రేలియా జట్టు 52 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ బెత్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్‌తో కలసి బారత బౌలర్లను సమర్ద వంతంగా ఎదుర్కున్నారు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే తహిల మెక్‌గ్రాత్ (74) అవుటైన తర్వాత బెత్ మూనీ (125), నికోలా కేరీ (39) కలసి చివర వరకు ఆడారు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా జులన్ గోస్వామి బౌలింగ్ చేసింది.
చివరి ఓవర్లో తొలి బంతికి 3 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతికి మరో రెండు పరుగులు తీశారు. మూడో బంతి బీమర్ కావడంతో అది నోబాల్‌గా ప్రకటించారు. ఫ్రీ హిట్ బంతికి ఒక పరుగు వచ్చింది. నాలుగో బంతికి మరో పరుగు వచ్చింది. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా గోస్వామి వేసిన బంతిని కేరీ మిడ్ వికెట్ పైకి బాదడంతో ఫీల్డర్ క్యాప్ పట్టి ఇండియా గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్లు ఆ బాల్ బీమర్ అవునో కాదో నిర్దారిచడానికి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయితే థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించడంతో ఒక పరుగుతో పాటు ఫ్రీ హిట్ వచ్చింది. చివరి బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్లు 2 పరుగులు తీసి మ్యాచ్ గెలిచారు. భారత జట్టు మ్యాచ్ చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. ఇక భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడి సీరీస్ కూడా కోల్పోయింది. బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.