Nita Ambani | నీతా అంబానీకి అరుదైన గౌరవం...

నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్

Nita Ambani | ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో అత్యంత ప్రభావశీలురైన పది మంది మహిళల జాబితాలో నీతా అంబానీకి చోటు దక్కింది.

 • Share this:
  ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు అధినేత నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా క్రీడా రంగంలో అత్యంత ప్రభావశీలురైన పది మంది మహిళల జాబితాలో నీతా అంబానీకి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన జాబితాలో టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్, జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ వంటి వారి సరసన నీతా అంబానీకి స్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ బిజినెస్ నెట్ వర్క్ సంస్థ  ‘ఐస్పోర్ట్ కనెక్ట్’ జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 మందితో తొలుత జాబితాను సిద్ధం చేశామని, నిపుణులైన తమ ప్యానెల్ సభ్యులు అందులో నుంచి 10 మంది ప్రభావశీలురైన 10 మందిని ఎంపిక చేశారని ఐస్పోర్ట్‌ కనెక్ట్ తెలిపింది. ఆ ప్యానెల్‌లో టెల్‌స్ట్రా గ్లోబల్ సేల్స్ హెడ్ అన్నా లాక్ వుడ్, వై స్పోర్ట్ మేనేజింగ్ పార్ట్‌నర్ హ్యాంకాక్, ఐసీసీ మీడియా హక్కుల విభాగం మాజీ హెడ్ ఆర్తి దబాస్, ఐస్పోర్ట్‌కనెక్ట్ సీఈఓ శ్రీ వర్మ ఉన్నారు.

  రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న నీతా అంబానీ పలు క్రీడా విభాగాల్లో కాలుమోపారు. భారత్‌లోనే కాదు, విదేశాల్లో కూడా ఆమె క్రీడా ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆమె అధినేత కూడా.

  క్రీడా రంగంలో ప్రభావశీలురైన పది మంది మహిళల జాబితాలో నీతా అంబానీతో పాటు ప్రముఖ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్, ఫుట్ బాలర్ మేగాన్ రాపినో, టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్, నావోమి ఒసాకా, ఎల్లీ నార్మన్ (ఫార్ములా వన్ మార్కెటింగ్ & కమ్యూనికేషన్ డైరెక్టర్), కాథీ ఏంజెల్‌బెర్ట్ (కమిషనర్, WNBA), ఫత్మా సమౌరా (ఫిఫా సెక్రటరీ జనరల్), మేరీ డేవిస్ (సీఈఓ, స్పెషల్ ఒలింపిక్స్), క్లార్ కానర్ (ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మహిళా క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్) ఉన్నారు.

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీ 2014 జూన్ నుంచి ఆ సంస్థ బోర్డులో ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఐస్పోర్ట్‌కనెక్ట్ సిద్ధం చేసిన తొలి జాబితాలో సానియా మీర్జా, మిథాలీ రాజ్ పేర్లు కూడా ఉన్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: