Chess : మోసం చేసి విశ్వనాథన్ ఆనంద్ మీద గెలిచాడు.. పైగా సమర్థించుకున్నాడు..!

గ్రాండ్‌మాస్టర్ ఆనంద్‌పై చీట్ చేసి గెలిచాడు.. తర్వాత ఏం జరిగిందంటే!

చారిటీ మ్యాచ్‌లో సరదాగా చెస్ ఆడాల్సిన వ్యక్తి.. ఆనంద్‌పై గెలవాలనే తాపత్రయంలో మోసానికి పాల్పడ్డాడు. విషయం బయటపడిన తర్వాతైన మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పకుండా సమర్థించుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే..

  • Share this:
    భారత గ్రాండ్ మాస్టర్ (Grand Master) విశ్వనాథన్ ఆనంద్‌తో (Vishwanathan Anand) ఆన్‌లైన్ ద్వారా చెస్ గేమ్ ఆడి.. మోసపూరితంగా (Cheating) గెలిచిన సంఘటన దుమారం రేపింది. కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ పేరిట ఆదివారం ఒక చారిటీ చెస్ పోటీ నిర్వహించారు. దేశంలోని సెలెబ్రిటీలు, ప్రముఖులతో విశ్వనాథన్ ఆనంద్‌కు ఆన్‌లైన్ ద్వారా చెస్ పోటీ నిర్వహించారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్ కామత్ (Nikhil Kamat) కూడా పోటీ పడ్డారు. ఈ గేమ్‌లో అనంద్‌పై నిఖిల్ గెలిచారు. కాగా, కామత్ మోసపూరితంగా ఆ గేలమ్ గెలిచినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యదర్శి భరత్ చౌహాన్ స్పందించారు. చారిటీ మ్యాచ్‌లలో ఇలా మోసం చేసి గెలవడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు మోసం చేసి గెలిచిన నిఖిల్ కామత్ కూడా ట్విట్టర్ ద్వారా తాను చేసిన పనిని వివరించాడు. 'నా చిన్నప్పటి నుంచి విశ్వనాథన్ ఆనంద్‌తో ఆడటం ఒక కల. అది అక్షయ పాత్ర ద్వారా నెరవేరింది. అయితే నేను విశ్వనాథన్ ఆనంద్‌ను నిజంగానే ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి తాను ఇతరుల నుంచి, కంప్యూటర్ నుంచి కొన్ని ఎత్తుల సహాయం పొందాను. ఇది చారిటీ కోసం నిర్వహించిన గేమ్ కాబట్టి నా సంతోషం కోసమే ఇలా చేశాను. దీని వల్ల ఇన్ని సమస్యలు తలెత్తుతాయని ఊహించలేదు. అందుకే క్షమాపణలు' అంటూ తూతూ మంత్రంగా అపాలజీ చెప్పి తప్పించుకున్నాడు.

    మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఒక చారిటీ కోసం పలు రంగాల్లోని ప్రముఖులతో చెస్ ఆడటం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి.. ఆటలోని నియమాలను పాటిస్తూ ఆడటం సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే తాను ఆడాను. ఇతరులు కూడా అదే నిజాయితీతో ఆడారని భావించాను అని విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశారు. కాగా నిఖిల్ కామత్ సరదాగా చేసిన పని ఇప్పుడు ఆ చారిటీ గేమ్‌కు మచ్చ తీసుకొని వచ్చింది. ఆనంద్‌పై గెలవాలనే తాపత్రయంతో ఇలా చేశాడని కొంత మంది సమర్థించగా.. అంత పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడై ఉండి ఇలా చీటింగ్ చేస్తాడా అని విమర్శిస్తున్నారు.

    అక్షయపాత్ర  ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఈ గేమ్‌లో యజువేంద్ర చాహల్, అమిర్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, అనన్య బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ వేదికగా వీరంతా విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడ్డారు.
    Published by:John Naveen Kora
    First published: