Home /News /sports /

Exclusive: పదో తరగతి ఫెయిల్.. అదే మలుపు.. ఐసీసీ తొలి మహిళా రిఫరీ జీఎస్ లక్ష్మి

Exclusive: పదో తరగతి ఫెయిల్.. అదే మలుపు.. ఐసీసీ తొలి మహిళా రిఫరీ జీఎస్ లక్ష్మి

జీఎస్ లక్ష్మి, ఐసీసీ బోర్డ్

జీఎస్ లక్ష్మి, ఐసీసీ బోర్డ్

జీఎస్ లక్ష్మి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో తొలి మహిళా రిఫరీగా ఎన్నికై ఘన చరిత్ర సృష్టించింది. జీఎస్‌ లక్ష్మితో న్యూస్‌18 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

  గ‌ల్లీ క్రికెట్ నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్లింది ఆ మ‌హిళ. వెళ్ల‌డ‌మే కాదు క్రికెట్ లో అత్యంత కీల‌క‌మైన బాధ్య‌త‌కు తొలి మ‌హిళ‌గా ఎంపికై రికార్డు సృష్టించింది. అంత‌ర్జాతీయ క్రికెట్ రిఫ‌రీగా నియ‌మితులైన తెలుగు మ‌హిళ జీఎస్ ల‌క్ష్మీ న్యూస్ 18 తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ప‌దో త‌ర‌గ‌తిలో మార్కులు త‌క్కువ రావ‌డంతో ప్రారంభ‌మైన లక్ష్మి ప్ర‌స్థానం ఆమె మాటల్లోనే.

  అంత‌ర్జాతీయ తొలి మ‌హిళా రిఫరీగా ఎంపిక‌వ‌డం ప‌ట్ల మీ స్పంద‌నేంటి?
  చాలా సంతోషంగా ఉంది. నా క్రికెట్ ప్ర‌స్థానం గ‌ల్లి స్థాయి నుంచి ప్రారంభ‌మైంది. ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్ల‌డం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఈ విభాగానికి నేను తొలి మ‌హిళ‌గా ఎంపిక‌వ‌డం ఇంకా సంతోషం. నా తల్లిదండ్రులు, స్నేహితులు స‌హ‌కారం నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

  పురుషుల ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉన్న ఈ రంగంలోకి మీరు రావ‌డానికి కార‌ణం?
  ఈ రంగంలోకి నేను రావ‌డం చాలా విచిత్రంగా జ‌రిగింది. ఇప్ప‌టికీ అది త‌లుచుకుంటే నాకు ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. 1985లో నాకు పదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో అప్పట్లో కాలేజీలో సీటు దొరకలేదు. అలా సీటు దొర‌క‌క‌పోవ‌డ‌మే నాకు ప్ల‌స్ అయింది. నాకు సీటు ఇవ్వ‌డానికి తిరస్కరించిన ప్రిన్సిపాల్ మా నాన్నతో ‘అమ్మాయి చ‌దువు కాకుండా ఇంకా ఎమైనా అంశాల్లో ఆస‌క్తి చూపిస్తోందా?’ అని అడిగారు. అప్పుడు ఆయ‌న వీధిలో పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడుతుందని చెప్పారు. అయితే స్పోర్ట్స్‌లో జాయిన్ చేయండి అని స‌ల‌హా ఇచ్చారు. అలా క్రికెట్ లో నా ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది.

  ఈ రంగంలోకి ఎందుకొచ్చామా అని బాధ‌ప‌డిన సందర్భాలు ఉన్నాయా?
  ఏం లేవు. కానీ ఒక క్రీడాకారిణిగా నిరుత్సాహప‌డిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. గ‌తంలో ఓ సారి నేను ప్ర‌య‌త్నం చేశా. అప్పుడు అవ‌కాశం రాన‌ప్పుడు చాలా బాధ ప‌డ్డా. అయితే, అవన్నీ స్పోర్ట్స్‌లో సహజం. వాస్తవానికి నాకు బౌలింగ్ అంటే చాలా ఇష్టం.

  మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి..
  మా స్వ‌స్థ‌లం రాజ‌మండ్రి. మా నాన్న వృత్తిరీత్యా టాటా కంపెనీలో ప‌నిచేసేవారు. అందుక‌ని మేం జంషెడ్పూర్ లో ఉండేవాళ్లం. నా చదువు అంతా అక్క‌డే సాగింది. అలా త‌రువాత రైల్వే లోకి ఎంట్రీ అయ్యా. నేను బీహార్ త‌రఫున ఆడుతున్నప్పుడు టాప్‌ ప్లేయర్‌ రజనీ వేణుగోపాల్‌ పరిచయం అయ్యారు. ఆయ‌న స‌ల‌హా, స‌హకారంతో రైల్వేలో ఉద్యోగం వ‌చ్చింది. దాంతో పాటు రైల్వేస్ త‌రఫున ఆడే అవ‌కాశం కూడా వ‌చ్చింది.

  బీసీసీఐలో మీ ప్ర‌స్థానం గురించి చెప్పండి
  2008 నుంచి ఇప్పటివరకూ బీసీసీఐ రిఫరీగా 75పైగా మ్యాచ్‌లకు ప‌ని చేశా. వాస్త‌వానికి బీసీసీఐ నామినేట్‌ చేయడంతో ఐసీసీ రిఫరీగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, దక్షిణ మధ్య రైల్వేల తరఫున చాలా మ్యాచ్‌లు ఆడా. రెండుసార్లు సౌత్‌ జోన్‌ కెప్టెన్‌గా ఉన్నా.

  ఈ రంగంలో మీరు మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న?
  తొలి మ‌హిళా రిఫరీగా నేను ఎంపిక కావ‌డం కంటే ఇంకేం ఉంటుంది.? 1999లో అంతర్జాతీయ జట్టుకు సెలక్ట్‌ కావడం కూడా నా క్రీడా జీవితంలో మ‌ర్చిపోలేను.

  మ‌హిళ‌ల‌కు మీరిచ్చే సందేశం..
  ప‌ట్టుద‌ల‌తో పాటు కృషి ఉంటే మ‌హిళ‌లు కూడా ఎమైనా సాధించ‌వ‌చ్చు. కాక‌పోతే మేము మ‌హిళ‌లం అనే ఆలోచ‌న మ‌న మైండ్ నుంచి తీసేయాలి.

  (బాల‌కృష్ణ‌.ఎమ్, సీనియ‌ర్ క‌రస్పాండెంట్, న్యూస్18)

  First published:

  Tags: Cricket, ICC, News18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు