NEW ZEALAND TOUR OF INDIA CHECK BILATERAL SERIES PREVIEW AND PREDICTION JNK
IND vs NZ: వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన మూడు రోజులకే మరో టీ20 సమరం.. ఇండియా-కివీస్ మధ్య కీలక సిరీస్
ఇండియా-న్యూజీలాండ్ సిరీస్‌లో పై చేయి ఎవరిది?
IND vs NZ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన మూడు రోజులకే ఇండియా - న్యూజీలాండ్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతున్నాయి. మెగా ఈవెంట్లో నిరాశాజనక ఫలితాలు సాధించిన ఈ రెండు జట్లు విజయంతో ఊరట పొందాలని చూస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ ముగిసిన మూడు రోజుల్లోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు తెరలేచింది. ఫైనల్లో ఓడిన న్యూజీలాండ్ (New Zealand) నేరుగా ఇండియా పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగానే న్యూజీలాండ్ జట్టు 3 టీ20లు, 2 టెస్టుమ్యాచ్‌లు ఆడటానికి ఇండియాకు వస్తున్నది. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన మూడో రోజే కివీస్ జట్టు ద్వైపాక్షిక పర్యటనకు రావడం విశేషం. ఒక వేళ టైటిల్ గెలిచి ఉంటే ఆ జట్టు మంచి ఊపులో ఉండేది. కానీ ఫైనల్లో ఓడిపోయి కివీస్.. నాకౌట్ దశకు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన టీమ్ ఇండియా (Team India) తలపడుతుండటం ఆసక్తి కలిగిస్తున్నది. గత కొన్ని నెలలుగా తీరిక లేని క్రికెట్ ఆడుతుండటంతో పలువురు సీనియర్లకు బీసీసీఐ (BCCI) విశ్రాంతి కల్పించింది. వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించారు. ఇది ఒకరకంగా రోహిత్ శర్మకు తొలి పరీక్ష అని చెప్పుకోవచ్చు. అంతా యువకులతో కూడిన జట్టును రోహిత్ శర్మ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా తీరిక లేని క్రికెట్ ఆడుతున్నది. కరోనా లాక్డౌన్ అనంతరం ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లాండ్ సిరీస్, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటన, ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్‌లతో చాలా బిజీగా మారిపోయింది. దీంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టులో పలు మార్పుల చేసింది. సీనియర్లకు విశ్రాంతి కల్పించి యువకులకు జట్టులో అవకాశం కల్పించింది. టీ20 జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఇక గత కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించింది. కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమికి విశ్రాంతి కల్పించింది. వీరిలో కోహ్లీ ఒక్కడే రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు.
ఇక టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్‌లను పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్‌లకు స్థానం కల్పించారు. ఈ ముగ్గురు ఐపీఎల్లో చక్కగా రాణించారు. అంతే కాకుండా హోమ్ పిచ్‌లపై వీరికి మంచి అనుభవమే ఉన్నది. బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్ తిరిగి రావడం జట్టుకు కలసి వస్తుంది. బ్యాటింగ్‌లో రోహిత్, రాహుల్‌కు తోడు రుతురాజ్, సూర్యకుమార్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం చేసి ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తే తిరుగుండదు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన కాస్త డీలా పడిన న్యూజీలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టులోని కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీలకు ఇండియా పిచ్‌లపై మంచి అనుభవమే ఉన్నది. పైగా వీళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. డారిల్ మిచెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జేమ్స్ నీషమ్ బంతితో పాటు బ్యాటుతో కూడా రాణిస్తున్నాడు. మార్టిన్ గుప్తిల్ టీ20 వరల్డ్ కప్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే జట్టులో డెవాన్ కాన్వే లేకపోవడం పెద్ద లోటే అని అనుకోవచ్చు. కాన్వే లేకపోవడం వల్ల వరల్డ్ కప్ ఫైనల్లో కూడా కివీస్ భారీ మూల్యాన్నే చెల్లించింది. అయితే టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత కివీస్ ఆటగాళ్ల మానసిక పరిస్థితి కూడా సిరీస్‌పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. ఆ ఓటమి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే ఈ సిరీస్ అంత రసవత్తరంగా సాగుతుంది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.