Team India : టీమ్ ఇండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్.. ఇంగ్లాండ్ పర్యటనకు జట్టుతో పాటు వెళ్లనున్న కొత్త కోచ్

టీమ్ ఇండియా మహిళా జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్

టీమ్ ఇండియా మహిళా జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ శివ్ సుందర్ దాస్‌ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. జూన్ 2వ తేదీ జట్టుతో పాటు ఆయన ఇంగ్లాండ్ పయనమవనున్నారు.

 • Share this:
  టీమ్ ఇండియా (Team India)  పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు (Women team) కూడా ఇంగ్లాండ్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. గత వారమే మహిళా జట్టుకు హెడ్ కోచ్‌గా రమేష్ పవార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాటింగ్ కోచ్‌గా (Batting Coach) మాజీ క్రికెటర్ శివ్ సుందర్ దాస్‌ను (Shiv Sunder Das) నియమించింది. నేషనల్ క్రికెట్ అకాడమీలో (NAC) బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న శివ్ సుందర్ దాస్ తన అనుభవంతో ఇంగ్లాండ్ పర్యటనలో అమ్మాయిలను గైడ్ చేస్తాడని బీసీసీఐ బావిస్తున్నది. మే 19 నుంచే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సిన క్రికెటర్లు అందరూ ముంబై రావాలని బీసీసీఐ సూచించింది. అందుకే అంతకు ముందే బ్యాటింగ్ కోచ్ నియామకం చేపట్టింది. ఒడిషాకు చెందిన శివ్ సుందర్ దాస్ ఇండియా తరపున 23 టెస్టులు ఆడి 35 సగటుతో 1300 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్దసెంచరీలు ఉన్నాయి. ఇండియా చాలా ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతుండటంతో శివ్ సుందర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

  రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ఎన్‌సీఏలో ఎంతో మంది క్రికెటర్ల బ్యాటింగ్ టెక్నిక్‌ను సరి చేసిన రికార్డు శివ్ సుందర్ పేరిట ఉన్నది. గత నాలుగైదు ఏళ్లుగా అతడు బెంగళూరులోని ఎన్‌సీఏ కోచ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. 'తనకు కోచ్‌గా అవకాశం ఇచ్చిన రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి ధన్యవాదాలు' అని దాస్ చెప్పాడు. గంగూలీ నేతృత్వంలో శివ్ సుందర్ దాస్ టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ కూడా టీమ్ ఇండియా తరపున మ్యాచ్‌లు ఆడాడు. 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమ్ ఇండియా 2002లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు శివ్ సుందర్ దాస్ కూడా జట్టులో ఉన్నాడు. ఆ పర్యటనలో ఆడిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో శివ్ సుందర్ 250 పరుగులు చేశాడు. ఆ టూర్‌లో శివ్ సుందర్ అత్యధిక స్కోర్ అదే కావడం గమనార్హం.

  వాస్తవానికి టీమ్ ఇండియా పురుషుల జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటానికి శ్రీలంక పర్యటనకు జులైలో వెళ్లాల్సి ఉన్నది. కోహ్లీ, రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర కోచ్‌లు జట్టుతో పాటు ఇంగ్లాండ్‌లో ఉంటారు. దీంతో టీమ్ ఇండియా బీ జట్టుతో పాటు రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎన్ఏసీలోని ఇతర స్టాఫ్ రాహుల్‌కు అసిస్టెంట్లుగా శ్రీలంక వెళ్లాల్సి ఉన్నది. ఇప్పుడు ఎన్ఏసీ బ్యాటింగ్ కోచ్ శివ్ సుందర్ దాస్ ఇంగ్లాండ్ వెళ్లనుండటంతో వేరే కోచ్‌ను వెతకాల్సిన అవసరం ఉంది.
  Published by:John Naveen Kora
  First published: