ఒలంపిక్ (Tokyo Olympics) పతకం సాధించడం పక్కన పెడితే.. అసలు ఒలంపిక్స్‌కు అర్హత సాధించడమే ఒక అఛీవ్మెంట్. ఒలంపిక్స్‌లో ఉండే కొన్ని బెర్త్‌ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అథ్లెట్లు, క్రీడాకారులు పోటీ పడుతుంటారు. ఇక అలాంటిది మన దేశంలో పెద్దగా ఆదరణ లేని క్రీడలో రాణించి ఒలంపిక్ బెర్త్ సాధించడం అంటే ఆషామాషీ కాదు. కానీ తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్ (Netra Kumanan)సెయిలింగ్‌లో (Sailing) ఒలంపిక్ బెర్త్ సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఒమన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌లో (Asia Qualifiers) లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్ జరుగుతున్నది. బుధవారం రేసు ముగిసే సరికి 21 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న నేత్ర నేరుగా ఒలంపిక్స్ బెర్త్ కొట్టేసింది. గురువారం కూడా పోటీలు కొనసాగనున్నాయి. కానీ వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా నేత్రను ఒలంపిక్ వర్తించింది. దీంతో సెయిలింగ్‌లో ఒలంపిక్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. గతంలో సెయిలింగ్‌లో ఇండియా తరపున 9 మంది అర్హత సాధించగా.. వారందరూ పురుషులే.
గురువారం కూడా రేసు ఉన్నా సరే నేత్ర ఒలంపిక్స్ అర్హత సాధించడం ఖాయం కావడం వెనుక ఒక కారణం ఉన్నది. నేత్ర, తన సమీప ప్రత్యర్థి మధ్య 21 పాయింట్ల అంతరం ఉన్నది. అయితే గురువారం జరిగే పోటీలు 20 పాయింట్ల కోసమే జరుగనున్నది. ఆ పాయింట్లన్నీ సమీప ప్రత్యర్ధి గెలిచినా నేత్ర మరో పాయింట్ ఆధిక్యంలోనే ఉంటుంది. అందుకే నిర్వాహకులు ఆమె క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆసియా సెయిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు మాలవ్ ష్రాఫ్ అధికారికంగా వెల్లడించారు. కాగా, భారత్ తరపున ఒలంపిక్స్‌లో పాల్గొన్న సెయిలర్లలో మాలవ్ ష్రాఫ్ కూడా ఒకరు. ఆయన 2004 ఏథెన్స్ ఒలంపిక్స్‌లో పాల్గొన్నాను.
ఇక భారత్ తరపున పాల్గొన్న సెయిలర్లు సోలి కాంట్రాక్టర్, బాసిత్ (1972 మ్యూనిక్), ధృవ్ భండారి (1984 లాస్ఏంజెల్స్), కెల్లీ రావు (1988 సియోల్), ఫారుఖ్ తారాపూర్, సైరస్ కామా (1992 బార్సిలోనా), మాలవ్ ష్రాఫ్, సుమిత్ పటేల్ (2004 ఏథెన్స్), నచ్తార్ సింగ్ జోహల్ (2008 బీజింగ్) ఒలంపిక్స్‌లో పాల్గొన్నారు. గత ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. జులై 23 నుంచి టోక్యోలో ఒలంపిక్స్ ప్రారంభమవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netra Kumanan, Olympics, Sailing, Tokyo Olympics