టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణం (Gold Medal) గెలవగానే.. యావత్ భారత దేశం తామే ఆ పతకాన్ని గెలిచేసినంత సంబరపడిపోయింది. నీరజ్ చోప్రా ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు సందడి చేశారు. నీరజ్ చోప్రా 'బాలీవుడ్ హీరో'కు ఏ మాత్రం తీసిపోడు.. ఆ లాంగ్ హెయిర్.. కండలు తిరిగిన బాడీతో సూపర్ హీరోలా ఉన్నాడంటూ తెగపొగిడేశారు. కానీ.. మనం ఈ రోజు చూస్తున్న నీరజ్ చోప్రా.. ఒకప్పుడు ఇలా లేడు. అసలు హీరో మెటీరియల్ కాదు కదా.. తోటి స్నేహితులే అతడి రూపాన్ని చూసి ఆట పట్టించే వాళ్లు. ఎందుకంటే పదేళ్ల వయసుకే నీరజ్.. ఊబకాయంతో బాధపడ్డాడు. వయసును మించిన బరువుతో స్నేహితులు, బంధువుల వద్ద మాటలు పడ్డాడు. ఏరోజైనా మంచిగా కుర్తా-పైజామా వేసుకొని వెళ్తే.. అరెవో సర్పంచ్... అని ఆట పట్టించే వాళ్లు. సర్పంచ్ అంటే ముసలోడా అని వ్యంగ్యంగా అన్నట్లు అన్నమాట. ఈ అవమానాలు.. ఛీత్కారాలు నీరజ్ మనసులో కసిని పెంచాయి. ఎలాగైనా బరువు తగ్గి అందరికీ సమాధానం చెప్పాలని అనుకున్నాడు. 17 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో నీరజ్ అందరి కంటే పెద్ద పిల్లాడు. అతడి పని ఏమీ ఉండేది కాదు. రోజు తినడం.. ఊర్లో బలాదూర్ తిరగడం. దీంతో విపరీతంగా బరువు పెరిగాడు. అయితే స్నేహితులు, బంధువుల అవమానాలను తట్టుకోలేక నీరజ్ ఏడ్చేవాడు. అతని బాధను చూసి తల్ల దండ్రులు కూడా నీరజ్ బరువును తగ్గించాలని డిసైడ్ అయ్యారు.
పానిపట్‌కు సమీపంలోని ఖాంద్ర అనే గ్రామంలో నీరజ్ కుటుంబం నివసించేది. నీరజ్ బరువు తగ్గించడానికి ప్రతీ రోజు అతడిని పానిపట్ స్టేడియంకు తీసుకొని వెళ్లి అక్కడ పరుగెత్తించేవారు. నీరజ్ అక్కడ ట్రాక్‌పై పరుగులు పెడుతూనే.. జావెలిన్ త్రో చేసే వాళ్లను చూశాడు. ఈటెను కసిగా దూరంగా విసరడం అతడికి ఎందుకో నచ్చింది. అలా తొలి సారి జావెలిన్ పట్టుకున్న నీరజ్.. దాన్నే లోకంగా చేసుకున్నాడు. బరువు తగ్గించుకుందామని వెళ్లిన వాడు కాస్తా.. అథ్లెట్‌గా మారిపోయాడు. జావెలిన్ త్రోలో శిక్షణ కోసం పంచకులలోని దేవీలాల్ స్టేడియంకు వెళ్లాడు. ఆ తర్వాత వరుసగా జూనియర్ లెవెల్లో పతకాలు కొట్టాడు. 2015లోనే అతడు 80 మీటర్ల మార్కును దాటేశాడు. ప్రపంచ అండర్- 20 చాంపియన్‌షిప్‌లో ఏకంగా రికార్డు సృష్టించాడు. కానీ అతడు మరింత దూరం విసరడానికి మెరగైన శిక్షణ, సామాగ్రి అవసరం అయ్యింది. దీంతో అత్యుత్తమ శిక్షణ కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో ఏకంగా స్వర్ణ పతకం గెలిచాడు.
INDvENG: టీమ్ ఇండియా ముందు అద్భుత అవకాశం.. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో అరుదైన రికార్డుకు చేరువలో..
నీరజ్ చోప్రా టెక్నిక్.. విసురుతున్న దూరం చూసి కోచ్‌లు తప్పకుండా ఒలింపిక్ పతకం సాధిస్తాడనిచెబుతుండే వాళ్లు. కరోనా కారణంగా గేమ్స్ వాయిదా పడిన సమయంలో భుజం గాయంతో బాధపడ్డాడు. కానీ వెంటనే కోలుకొని శిక్షణపై ఫోకస్ చేశాడు. చిన్నప్పటి కసిని మొత్తం టోక్యో నేషనల్ స్టేడియంలో చూపించి స్వర్ణం గెలిచేశాడు. నీరజ్ చోప్రా బరువు తగ్గి.. పతకాలు సాధిస్తున్న సమయంలో కూడా అతని గ్రామంలోని స్నేహితులు, బంధువులు 'సర్పంచ్' అని పిలవడం మానలేదు. అప్పట్లో ఎగతాళిగా పిలిచిన వాళ్లు.. ఇప్పుడు గౌరవంగా పిలుస్తున్నారు. ఖాంద్రాకు అతను పర్మనెంట్ సర్పంచ్ అంటూ గొప్పగా చెబుతున్నారు. కేవలం ఖాంద్రానే కాదు.. దేశమంతా ఇప్పుడు నీరజ్ నామ జపం చేస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics