టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics) అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం (Gold Medal) తీసుకొని వచ్చిన నీరజ్ చోప్రాపై (Neeraj Chopra) ఇంకా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎంతో మంది నీరజ్‌ను పిలిచి సన్మానాలు, సత్కారాలు చేస్తున్నారు. అథ్లటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఒలింపిక్స్ (Olympics) ఫైనల్ రౌండ్‌లో హేమా హేమీలకు సాధ్యం కాని దూరం విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నీరజ్ చోప్రా దరిదాపుల్లోకి కూడా ఇతర జావెలిన్ త్రోయర్లు రాలేకపోయారు. ఫైనల్ రౌండ్‌లో ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. అయితే స్వర్ణ పతక ప్రదర్శనకు ముందు నీరజ్ చోప్రాను పాకిస్తాన్‌కు చెందిన అథ్లెట్ అర్షద్ నదీమ్ (Arshad Nadeem) టెన్షన్ పెట్టాడంటా. ఆ రోజు జరిగిన సరదా ఘటనను నీరజ్ చోప్రా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్‌లో తొలి త్రో నేనే చేయాలి. మ్యాచ్ అఫీషియల్స్ తన పేరు చెబుతున్నారు. నేను విసరడానికి సిద్దమవుతుండగా నా జావెలిన్ కనిపించలేదు. అరే.. నేను విసిరే జావెలిన్ ఏమైందని కంగారుగా అంతా వెతికాను. తీరా అది పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ దగ్గర ఉంది. వెంటనే వెళ్లి.. భాయ్ అది నా జావెలిన్. ఇటు ఇవ్వు అని అడిగాను. అతను కూడా వెంటనే నాకు ఇచ్చాడు. అదే కంగారులో నేను జావెలిన్ విసిరాను. దీంతో కేవలం 87.03 మీటర్లు మాత్రమే విసరగలిగాను' అని నీరజ్ చోప్రా చెప్పాడు.
తొలి త్రోలో అనుకున్న లక్ష్యం మేరకు విసరక పోవడంతో రెండో త్రో కోసం జావెలిన్ జాగ్రత్తగా పక్కకు పెట్టి.. మళ్లీ సిద్దపడ్డాడంటా. రెండో సారి 87.58 మీటర్లు విసిరాడు. ఈ త్రో తర్వాత నీరజ్ సహా మిగిలిన అథ్లెట్లు ఎవరూ ఆ దూరాన్ని దాటలేకపోయారు. దీంతో నీరజ్ చోప్రాకు స్వర్ణం దక్కింది. అయితే ఆ రోజు జరిగిన సరదా ఘటన కాసేపు నన్ను టెన్షన్ పెట్టింది. కానీ రెండో త్రో కల్లా కోలుకున్నాను. నేను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా.. స్వర్ణం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సారి 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నట్లు నీరజ్ చోప్రా చెప్పాడు. మరోవైపు పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గురించి చెబుతూ.. ఆ రోజు అతను కావాలని చేసింది కాదు. అనుకోకుండా అలా తన జావెలిన్‌ను తీసుకొని ఉండొచ్చు. ఫైనల్ రౌండ్‌లో నదీమ్ కూడా మంచి ప్రదర్శన చేశాడని నీరజ్ చెప్పాడు. పాకిస్తాన్ అథ్లెటిక్స్‌కు నదీమ్ ఒక ముఖ చిత్రం లాంటి వాడు. రాబోయే కాలంలో నదీమ్ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పేరు నిలబెడతాడని నీరజ్ అన్నాడు. తామిద్దరం ఎంతో కాలంగా అంతర్జాతీయ వేదికల్లో పోటీ పడుతున్నాము. మా మధ్య మంచి స్నేహం ఉందని నీరజ్ చెప్పాడు. పాకిస్తాన్‌లో అతడికి మరింత మద్దతు లభిస్తే మరిన్ని అద్బుతాలు చేయగలడని నీరజ్ అభిప్రాయపడ్డాడు.
Taliban Team: టీ20 లీగ్‌లో తాలిబన్ జట్టు.. ఖంగుతిన్న నిర్వాహకులు.. తర్వాత క్షమాపణలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics