యూఎస్ ఓపెన్‌లో నవోమీ 'ఒసాకా' వండర్స్

137 ఏళ్ల అమెరికన్ ఓపెన్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ చేరిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణిగా నవోమీ ఒసాకా హిస్టరీ క్రియేట్ చేసింది.సింగిల్స్‌ ఫైనల్‌లో గ్రాండ్‌స్లామ్ క్వీన్ సెరెనా విలియమ్స్‌కే సవాల్ విసురుతోంది.

news18-telugu
Updated: September 7, 2018, 1:26 PM IST
యూఎస్ ఓపెన్‌లో నవోమీ 'ఒసాకా' వండర్స్
జపాన్ టెన్నిస్ సంచలనం నవోమీ ఒసాకా (Naomi Osaka/ Twitter)
  • Share this:
ఎటువంటి అంచనాల్లేవు..అయినా సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. ప్రీ క్వార్టర్‌ఫైనల్ కూడా దాటలేదనుకున్నారు..ఏకంగా ఫైనల్ చేరి టెన్నిస్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది. 2018 అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో గ్రాండ్‌స్లామ్ క్వీన్ సెరెనా విలియమ్స్‌కే సవాల్ విసురుతోంది.జపనీస్ రైజింగ్ స్టార్ నవోమీ ఒసాకా ప్రస్తుత యూఎస్ ఓపెన్‌లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది.అమెరికా,యూరప్ దేశాల ప్లేయర్స్ ఆధిపత్యం కొనసాగుతున్న మహిళల టెన్నిస్‌లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
2013లో ఇంటర్నేషనల్ టెన్నిస్‌లో అరంగేట్రం చేసి..గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడానికి ఐదేళ్లు పట్టింది.ప్రస్తుత అమెరికన్ ఓపెన్‌ తొలి రౌండ్ నుంచే తనదైన ముద్ర వేసింది. క్వార్టర్‌ఫైనల్ వరకూ గ్లుష్కో, సీగ్మండ్, సాస్నోవిచ్, సబాలెంకో వంటి బలహీనమైన ప్రత్యర్ధులనే ఓడించింది. క్వార్ట‌ర్‌ ఫైనల్ పోరులో ఉక్రెయిన్ స్టార్ లెసియా సురెంకోపై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో పెద్ద సంచలనమే స‌ృష్టించింది. తొలిసారిగా అమెరికన్ ఓపెన్ సెమీఫైనల్‌ చేరిన ఒసాకా గత ఏడాది రన్నరప్ మ్యాడిసన్ కీస్‌‌ను ఇంటిదారి పట్టించింది.

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాడిసన్ కీస్ జోరుకు చెక్ పెట్టింది. కార్లా సారెజ్ నవారో, డొమినికా సిబుల్కోవా వంటి పటిష్టమైన ప్రతర్ధులను ఓడించిన మ్యాడిసన్...వరుసగా రెండో సారి  ఫైనల్ చేరడం ఖాయమనుకున్నారంతా.  కానీ 20 ఏళ్ల ఒసాకాను అధిగమించడంలో మాత్రం విఫలమైంది. ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించి 6-2, 6-4తో రెండు సెట్లలోనే నెగ్గింది.ఈ పోటీలో 13 బ్రేక్ పాయింట్స్ కాపాడుకుని వీక్షకులతో పాటు విశ్లేషకులను సైతం మెప్పించింది.
కెరీర్‌లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ఒసాకా.. అమెరికన్ ఓపెన్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది. 137 ఏళ్ల అమెరికన్ ఓపెన్ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్ చేరిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణిగా హిస్టరీ క్రియేట్ చేసింది. చైనా మాజీ టెన్నిస్ దిగ్గజం లీ నా తర్వాత మహిళల గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ఆసియా టెన్నిస్ క్రీడాకారిణిగా అరుదైన ఘనతను సొంతంచేసుకుంది.

20 ఏళ్ల ఒసాకా కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 17.ప్రస్తుతం మహిళల టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ 19వ స్థానంలో ఉన్న ఒసాకా అమెరికన్ ఓపెన్‌లో 20వ సీడ్‌గా టైటిల్ వేట స్టార్ట్ చేసింది.ఫైనల్‌లో గ్రాండ్‌స్లామ్ క్వీన్ సెరెనా విలియమ్స్ వంటి అపార అనుభవమున్న ప్రత్యర్ధిని ఓడించాలంటే ఒసాకా అంచనాలకు మించి రాణించాల్సిందే. ఫైనల్ చేరడంతో చరిత్రను తిరగరాసిన ఈ జపనీస్ స్టార్..టైటిల్ నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Published by: Prasanth P
First published: September 7, 2018, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading